
నిజామాబాద్, వెలుగు : ఆదివాసీ, గిరిజనుల అస్తిత్వాన్ని దెబ్బతీసేలా బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లోని హరిత హోటల్లోని జిల్లా గిరిజనుల మీటింగ్‌లో మాట్లాడారు. పెట్టుబడిదారులకు అటవీ సంపదను అప్పగించేందుకు కేంద్ర సర్కార్ కుట్ర చేస్తుందన్నారు. గిరిజనుల హక్కు జల్, జమీన్, జంగల్‌పై కాంగ్రెస్ అంకితభావంతో ఉందన్నారు. రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర నిర్వహించి ప్రేమను పంచారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన కులగణన దేశవ్యాప్త చర్చకు తెరలేపిందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులకుప్ప అయిందన్నారు.
ఉపాధి హామీలో కూరగాయల సాగు
ఉపాధి హామీ స్కీమ్ కింద మహిళలతో కూరగాయల సాగును జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే ఆలోచన ఉందని మంత్రి సీతక్క తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో కలెక్టరేట్లో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. అంగన్వాడీ, మహిళా శక్తి భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. సీఎంఆర్ డిఫాల్ట్ మిల్లర్లపై రికవరీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. సర్కార్ బడుల్లో సౌకర్యాల పెంపునకు మరిన్ని నిధులు ఇస్తామన్నారు.
అన్ని సర్కార్ ఆసుపత్రుల్లో పాముకాటు మందులతో పాటు ఇతర మెడిసిన్స్ రెడీగా పెట్టుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో గవర్న్మెంట్ సలహాదారులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు తాహెర్, అన్వేష్‌రెడ్డి, ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
కామారెడ్డి, వెలుగు : మహిళను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ర్ట పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ, బీబీపేట మండలాల లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసి మాట్లాడారు. పేదల కడుపు నింపేందుకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 10 లక్షల బీమా ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ విక్టర్ పాల్గొన్నారు.