
- కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్మోగిన నినాదాలు
వెలుగు, నెట్వర్క్:ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మె సక్సెస్ అయ్యింది. కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీలు తీసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నినదించారు. మోదీ సర్కార్ కార్మిక చట్టాలను కాలరాసిందని మండిపడ్డారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, కుటీర పరిశ్రమలను మెరుగుపర్చాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ప్రతి కార్మికుడికి రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని, ఈపీఎఫ్ పెన్షన్ ఇవ్వాలని, నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని కోరారు. పలు గ్రామాలు, మండలాల్లో నల్లాబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్, అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, మున్సిపల్, పంచాయతీ కార్మికులు , మిడ్ డే మిల్స్ కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీల్లో పాల్గొన్నారు.