‘దిత్వా’ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్కు వర్షం ఉందా..? లేదా..?

‘దిత్వా’ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్కు వర్షం ఉందా..? లేదా..?
  • ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, నాగర్​కర్నూల్ జిల్లాలపై తుఫాను ప్రభావం
  • ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
  • రేపు తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్​
  • హైదరాబాద్లోనూ మోస్తరు వానలు
  • తుఫాన్ ప్రభావంతో తగ్గిన చలి తీవ్రత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంపై దిత్వా తుఫాను ఎఫెక్ట్ స్వల్పంగా ఉండనున్నది. తుఫాను ప్రభావంతో సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, నాగర్​కర్నూల్ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉంటుందని పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. మంగళవారం కూడా రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక, హైదరాబాద్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.

ప్రస్తుతం పుదుచ్చేరి – తమిళనాడు తీరాల నుంచి 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న దిత్వా తుఫాను.. సోమవారం ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను ప్రభావంతో దక్షిణాది జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా ఆకాశం అంతా మబ్బు పట్టింది. తుఫాను ప్రభావంతో జిల్లాల్లో చలి కాస్తంత తగ్గుముఖం పట్టింది. 18 జిల్లాల్లో 15 డిగ్రీల్లోపు.. మరో 15 జిల్లాల్లో 15 కన్నా ఎక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరులో 9.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ)లో 10.3, కామారెడ్డి జిల్లా మేనూరులో 10.8, నిజామాబాద్​ జిల్లా సాలూరలో 10.9, నిర్మల్ జిల్లా కుంటాలలో 11, సంగారెడ్డి జిల్లా కోహిర్​లో 11.2, వికారాబాద్​ జిల్లా మర్పల్లిలో 12.4, రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లాపూర్​లో 12.5, జగిత్యాల జిల్లా మల్లాపూర్​లో 12.5 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్​సిటీలో అత్యల్పంగా యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​లో 14.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బీహెచ్​ఈఎల్ వద్ద 14.4, రాజేంద్రనగర్​లో 14.7, కుత్బుల్లాపూర్​లో 16.1 డిగ్రీల చొప్పున నైట్ టెంపరేచర్స్ రికార్డయ్యాయి.