ఆక్సిజన్ అవసరం తగ్గింది..వేరే రాష్ట్రాలకు ఇవ్వాలన్న ఢిల్లీ ప్రభుత్వం

ఆక్సిజన్ అవసరం తగ్గింది..వేరే రాష్ట్రాలకు ఇవ్వాలన్న ఢిల్లీ ప్రభుత్వం

ఢిల్లీలో కరోనా వ్యాప్తి కేసులు ఎక్కువ కావడంతో ఆక్సిజన్ ఎక్కువ అవసరం అయ్యింది. అయితే అక్కడ కొద్ది రోజులుగా కేసుల నమోదు తక్కువ కావడంతో.. ఆక్సిజన్ అవసరాలు చాలా వరకు తగ్గిపోయాయని, మిగిలిన ఆక్సిజన్ ను వేరే రాష్ట్రాలకూ ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆస్పత్రిలోని ఆక్సిజన్ బెడ్లు ఖాళీ అవుతున్నాయని.. చాలా వరకు ఆక్సిజన్ అవసరం తగ్గిందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. 15 రోజుల క్రితం వరకు రోజూ 700 టన్నుల వరకు ఆక్సిజన్ అవసరం అయ్యిందని.. ఇప్పుడది 582 టన్నులకు తగ్గిందని చెప్పారు. 

ఇదే విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశామన్నారు మనీశ్ సిసోడియా. తమకు 582 టన్నులు కేటాయించి మిగతా మొత్తాన్ని ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సిందిగా కోరామని చెప్పారు. కష్ట కాలంలో ఆదుకున్న కేంద్ర ప్రభుత్వానికి..ఢిల్లీ హైకోర్టుకు సిసోడియా కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీలో అంతకుముందు కంటే 21 శాతం వరకు కేసులు తగ్గాయన్నారు.