
బటుమి (జార్జియా): ఫిడే విమెన్స్ వరల్డ్ కప్‌లో ఇండియా యంగ్ సెన్సేషన్ దివ్య దేశ్‌ముఖ్ సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో దివ్య 1.5–0.5తో వరల్డ్ చాంపియన్ టాన్ జోంగ్యి (చైనా)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఫలితంగా మెగా టోర్నీలో టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. తెల్లపావులతో ఆడిన దివ్య గేమ్ మొత్తం ఆధిపత్యం చూపెట్టింది. కీలక టైమ్‌లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ జోంగ్యికి చెక్ పెట్టింది.
101 ఎత్తుల పాటు సాగిన ఈ గేమ్‌లో ఇండియన్ ప్లేయర్ డిఫెన్స్‌లోనూ ఆకట్టుకుంది. ఇక తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి.. లీ తింగ్జీ (చైనా) మధ్య జరిగిన రెండో గేమ్ 75 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఫలితంగా ఇద్దరు ప్లేయర్లు 1–1తో సమంగా నిలిచారు. తెల్లపావులతో ఆడిన హంపికి మధ్యలో గెలిచే చాన్స్ వచ్చినా వృథా చేసుకుంది. ఫైనల్లో చోటు కోసం హంపి.. లీ తింగ్జీ గురువారం జరిగే టైబ్రేక్స్ ఆడనున్నారు.