ఫిడే విమెన్స్‌‌‌‌ చెస్ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ సెమీఫైనల్‌‌: హంపి, దివ్య గేమ్స్ డ్రా

ఫిడే విమెన్స్‌‌‌‌ చెస్ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ సెమీఫైనల్‌‌: హంపి, దివ్య గేమ్స్ డ్రా

బటుమి (జార్జియా): ఫిడే విమెన్స్‌‌‌‌ చెస్ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ సెమీఫైనల్‌‌‌‌ను ఇండియా లెజెండ్ కోనేరు హంపి, యంగ్‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌ దివ్య దేశ్‌‌‌‌ముఖ్‌‌‌‌ డ్రాతో ఆరంభించారు. మంగళవారం జరిగిన సెమీస్ తొలి గేమ్‌‌‌‌లో హంపి 38 ఎత్తుల్లో చైనా ప్లేయర్ లీ తింగ్జీతో పాయింట్ పంచుకుంది. నల్లపావులతో ఆడిన హంపి తొలుత ఊహించని ఎత్తుగడతో ప్రత్యర్థిని ఆశ్చర్యపరిచింది. మధ్యలో ఇద్దరూ సమానంగా ఆడటంతో గేమ్ డ్రాకు దారి తీసింది. 

మరో చైనా ప్లేయర్  టాన్‌‌‌‌ జోంగ్యితో నల్లపావులతో ఆడిన దివ్య 30 ఎత్తుల వద్ద  డ్రా చేసుకుంది. అద్భుతమైన డిఫెన్స్‌‌‌‌తో ఆకట్టుకున్న దివ్య  మాజీ వరల్డ్  చాంపియన్‌‌‌‌కు ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. బుధవారం రెండో గేమ్‌‌‌‌లో తెల్ల పావులతో ఆడటం హంపి, దివ్యకు ప్లస్ పాయింట్ కానుంది. ఇందులో గెలిస్తే  ఫైనల్ చేరుకుంటారు. ఈ గేమ్‌‌‌‌ కూడా డ్రా అయితే గురువారం టై బ్రైక్స్‌‌‌‌లో తలపడతారు.