దివ్యాంగ జంటకు పెండ్లి చేసిన పోలీసులు ..ఎల్కతుర్తి పోలీసులను అభినందించిన స్థానికులు

దివ్యాంగ జంటకు పెండ్లి చేసిన పోలీసులు ..ఎల్కతుర్తి పోలీసులను అభినందించిన స్థానికులు

ఎల్కతుర్తి, వెలుగు: దివ్యాంగ జంట ప్రేమించుకోగా.. పెండ్లికి యువకుడి పేరెంట్స్ అడ్డుపడ్డారు. పోలీసులు కుటుంబ పెద్దలుగా మారి పెండ్లి చేశారు. హనుమకొండ జిల్లా దేశాయిపేటకు చెందిన మట్ట రాజు యాదవ్(29), ఎల్కతుర్తి మండలం వల్లభపూర్ కు చెందిన అంబాల ధనలక్ష్మి(28) దివ్యాంగులు. వీరు కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కులాలు వేరుకావడంతో మట్ట రాజు కుటుంబం, బంధువులు పెండ్లికి వద్దని వారించారు. అయినా రాజు వినకపోవడంతో అతన్ని బంధించారు. కుటుంబ సభ్యుల చెర నుంచి తప్పించుకున్న రాజు, యువతి స్నేహితుల చొరవతో ఎల్కతుర్తి పోలీసులను ఆశ్రయించారు. 

ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఇరు కుటుంబాలను  పిలిచి కౌన్సెలింగ్​చేశారు. అయినా.. అబ్బాయి పేరెంట్స్ ఒప్పుకోలేదు. దీంతో  పోలీసులు పెండ్లి ఖర్చులు భరించి ప్రేమజంటను కలిపారు. భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎల్కతుర్తి పోలీసులను స్థానికులు అభినందించారు.