
దీపావళి పండుగ వస్తుందంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. టపాసులు పేల్చేందుకు రడీ అవుతారు. దీపావళి అంటే వెలుగుల పండుగ. చీకటిపై, చెడుపై పోరాడి గెలిచిన సందర్భం. ఈ సందర్భం దీపాల వెలుగులతో, బాణ సంచా మోతతో పండుగ అంటే పండుగలా ఉంటుంది. దీపావళి రోజు ఉల్లాసంగా బాంబులు కాల్చుకోవడానికి ముందు ఈ జాగ్రత్తలు పాటించండి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .
దీపావళి పిల్లలకు పెద్ద పండుగ. దీపావళికి రెండు, మూడు రోజుల ముందు నుంచే బాంబులను కొని తెచ్చిపెట్టుకుంటారు. పండుగరోజు ఎప్పుడెప్పుడు ఆ బాంబులు బయటికి తీసి కాలుద్దామా అని ఎదురుచూ స్తారు.
దీపావళి ( అక్టోబర్20) రోజు పిల్లల సంబరం అంతా ఇంతా ఉండదు.. చిన్న చిన్న కాకరపూవత్తుల నుంచి పైపైకి ఎగిరే రాకెట్ల వరకూ ఎన్నో బాంబులు కాలుస్తుంటారు. బాణాసంచా అంటే నిప్పుతో ఆట.... జాగ్రత్తగా ఉండాలి. పిల్లలయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
పేరెంట్స్ పక్కనే ఉండండి!
చిన్నపిల్లలు బాణసంచా కాలుస్తుంటే వాళ్లకు పక్కనే పెద్దవాళ్లు ఉండాలి. ఒంటరిగా వదిలేయకండి. మరీ పెద్ద శబ్దాలను ఇచ్చే బాంబులను పిల్లలకు ఇవ్వకపోవడమే మంచిది. అలాగే సరదాకి కొందరు పిల్లలు చేతుల్లోనే పటాకులు కాలుస్తుంటారు. అలాంటి వాటికి దూరంగా ఉంచండి. మట్టి నేల మీద, సిమెంట్ రోడ్డు మీదనే కాల్చేలా చూడండి. బాంబులు అం టించేటప్పుడు అగర్బత్తీలు వాడేలా చూసుకోండి.నేరుగా అగ్గిపెట్టెతోనే అంటిస్తే వెంటనేఅంటుకునే ప్రమాదం ఉంది.
ఈ ప్రమాదాలు ఎక్కువ
బాణాసంచా కాల్చేటప్పుడు ఊహించని విధంగా కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇలాంటివి జరగ కుండా ఉండాలంటే ఏదైనా బాంబు అంటించిన వెంటనే దూరంగా వెళ్లి నిలబడండి. పూర్తిగా వంగి ఎప్పుడూ పటాకులను అంటించకండి. పైకి ఎగిరి పేలే రాకెట్ లాంటివి ఇళ్లకు దూరంగా, చుట్టూ మైదానం లాంటి స్థలం ఉంటేనే అంటించండి. ఎవరికైనా ప్రమాదం జరిగితే వెంటనే నీళ్లు చల్లడమో, బట్టలు లాగడమో చేసినా ప్రమాదమే. వాళ్లను ముందు నేలపై పడుకోబెట్టి శరీరాన్ని అటూ ఇటూ బోర్లించండి.