ప్రధాని దీపావళి గిఫ్ట్‌‌‌‌ పేరిట సైబర్‌‌‌‌ మోసాలు : సైబర్ సెక్యూరిటీ బ్యూరో 

ప్రధాని దీపావళి గిఫ్ట్‌‌‌‌ పేరిట సైబర్‌‌‌‌ మోసాలు : సైబర్ సెక్యూరిటీ బ్యూరో 
  • 8 వేల నగదు బహుమతి అంటూ వాట్సాప్‌‌‌‌లో లింకులు 
  • అనుమానాస్పద లింకులు క్లిక్‌‌‌‌ చేయొద్దు: సైబర్ సెక్యూరిటీ బ్యూరో

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సైబర్ నేరగాళ్లు దీపావళి పండుగను టార్గెట్‌‌‌‌ చేశారు. పండుగకు గిఫ్ట్‌‌‌‌లు ఇవ్వడం ఆనవాయితీ కావడంతో వాటినే తమకు అనుకూలంగా చేసుకుని మోసాలకు తెరతీశారు. ప్రధాని గిఫ్ట్‌‌‌‌ పేరిట నకిలీ మెసేజ్‌‌‌‌లు తయారు చేసి సోషల్‌‌‌‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ‘‘దేశంలోని పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం రూ.8 వేల నగదు’’ ప్రయోజనం అందిస్తోందంటూ వాట్సాప్‌‌‌‌లో సర్క్యులేట్‌‌‌‌ చేస్తున్నారు.

వీటికి ఏపీకే ఫైల్స్ సహా  ఇతర మాల్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ లింకులను అటాచ్‌‌‌‌ చేస్తున్నారు. లింకులు ఓపెన్‌‌‌‌ చేసిన వెంటనే.. బ్యాంక్‌‌‌‌ డిటైల్స్ సహా పూర్తి డేటాను హ్యాక్‌‌‌‌ చేస్తున్నారు. ఇలాంటి లింకులు, మెసేజ్‌‌‌‌ల పట్ల అప్రమత్తంగా రాష్ట్ర సైబర్‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌‌‌‌బీ) ప్రజలను హెచ్చరించింది. ఈ మేరకు గురువారం టీజీ సీఎస్‌‌‌‌బీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శిఖాగోయల్‌‌‌‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రధానమంత్రి పేరును ఉపయోగిస్తూ, ప్రభుత్వ పథకమనే నమ్మకం కలిగించి సైబర్‌‌‌‌ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. పండుగల సమయంలో సైబర్‌‌‌‌ మోసాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏదైనా లింకుపై క్లిక్‌‌‌‌ చేసే ముందు, సమాచారాన్ని ఇతరులతో పంచుకునే ముందు, డిజిటల్‌‌‌‌ చెల్లింపులు చేసే ముందు ‘ఆగండి.. ఆలోచించండి.. ధ్రువీకరించండి’ అనే సూత్రాన్ని పాటించాలని సూచించారు.

రూ.8 వేలు నగదు పొందాలంటే వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ లింక్‌‌‌‌

ఫేక్ లింకులు నకిలీ వెబ్‌‌‌‌సైట్లకు దారితీసి బ్యాంకు వివరాలను తస్కరించే ప్రమాదం ఉందని సీఎస్‌‌‌‌బీ డైరెక్టర్ శిఖాగోయల్‌‌‌‌ తెలిపారు. బాధితుల ఖాతాల నుంచి అనధికార యూపీఐ లావాదేవీలు జరపడంతోపాటు, మొబైల్‌‌‌‌ ఫోన్లలో హానికరమైన సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రయోజన పథకాల వివరాలను అధికారిక ప్రభుత్వ వెబ్‌‌‌‌సైట్లు, ధ్రువీకరించిన ప్రకటనల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని సూచించారు.

గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజెస్  లింకులను క్లిక్‌‌‌‌ చేయవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్‌‌‌‌ చేయవద్దని స్పష్టం చేశారు. ఓటీపీలు, యూపీఐ పిన్‌‌‌‌లు, పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌లు, బ్యాంకు ఖాతాల వివరాలను అనుమానాస్పద వెబ్‌‌‌‌సైట్లలో నమోదు చేయకూడదని తెలిపారు. ఇప్పటికే అనుమానాస్పద లింకుపై క్లిక్‌‌‌‌ చేసి ఉంటే తదుపరి ఎలాంటి సమాచారాన్ని నమోదు చేయవద్దని, ఖాతాలు, మొబైల్‌‌‌‌ పరికరాల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి సైబర్ మోసం జరిగినా సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌  1930 కు కాల్‌‌‌‌ చేయాలని, www.cybercrime.gov.in వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఫిర్యాదు చేయవచ్చని శిఖా గోయాల్  పేర్కొన్నారు.