
- మూడో రౌండ్‌లో ఓడిన సీడెడ్ ప్లేయర్లు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. సీడెడ్ ప్లేయర్లకు షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా మూడో సీడ్, అమెరికా స్టార్ జెస్సికా పెగులాకు చుక్కెదురైంది. మెన్స్‌లో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ కూడా మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. టైటిల్ ఫేవరెట్లు నొవాక్ జొకోవిచ్, అరినా సబలెంకా నాలుగో రౌండ్‌లో అడుగు పెట్టారు. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో 28వ సీడ్ ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం) 6–1, 6–3తో పెగులాకు షాకిచ్చింది. గత ఐదు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో నాలుగింటిలో క్వార్టర్స్ చేరిన పెగులా ఈసారి నిరాశ పరిచింది. రెండు సెట్లలోనూ మెర్టెన్స్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. మరోవైపు పెగులాతో ఆడిన మూడో మ్యాచ్‌లోనూ నెగ్గిన మెర్టెన్స్ సర్వీస్‌లు, నెట్ గేమ్‌లో అదరగొట్టింది. వచ్చిన ఐదు బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకోగా.. పెగులా ఆరింటిలో ఒకే బ్రేక్ సాధించింది. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్)6–2, 6–2తో కమిలా రఖిమోవా(రష్యా)ను వరుస సెట్లలో చిత్తు చేసి నాలుగో రౌండ్ చేరింది. ఇతర మ్యాచ్‌ల్లో రష్యా ప్లేయర్ పవ్లుచెంకోవా 4–6, 6–3, 6–0తో తన దేశానికే చెందిన 24వ సీడ్ పొటపోవాను ఓడించగా.. ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్) 2–6, 6–2, 7–5తో బ్లింకోవా (రష్యా)పై నెగ్గి ముందంజ వేసింది. అమెరికా ప్లేయర్ స్లోన్ స్టీఫెన్స్ 6–3, 3–6, 6–2తో యులియా పుతిన్స్తెవా (కజకిస్తాన్)ను ఓడించింది.
జొకో జోరు
మెన్స్ సింగిల్స్‌లో సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ నాలుగో రౌండ్ చేరుకున్నాడు. మూడో రౌండ్‌లో జొకో 7–6 (7/4), 7–6 (7/5), 6–2తో 29వ సీడ్ డెవిడవోచ్ ఫొకినా (స్పెయిన్)కు వరుస సెట్లలో చెక్ పెట్టాడు. తొలి రెండు సెట్లలో ఫొకినా నుంచి ప్రతిఘటన ఎదురైంది. వాటిని టై బ్రేక్స్‌లో నెగ్గిన నొవాక్.. మూడో సెట్‌ను ఈజీగా గెలిచాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఏస్ కొట్టిన అతను7 బ్రేక్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు నెగ్గి ఆధిక్యంలో నిలిచిన తర్వాత అనూహ్యంగా తడబడ్డ రష్యా స్టార్ ఏడో సీడ్ రుబ్లెవ్ 7–5, 6–0, 3–6, 6–7 (5/7), 3–6తో లోరెంజో సెనెగో (ఇటలీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. హోరాహోరీ పోరులో తొమ్మిది ఏస్‌లు, ఆరు బ్రేక్ పాయింట్లు సాధించిన రుబ్లెవ్ కీలక సమయాల్లో నిరాశ పరిచాడు. 43 అనవసర తప్పిదాలు చేసిన అతను నెట్ పాయింట్లు రాబట్టడంలో ఫెయిలై మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. మరో మ్యాచ్‌లో 11వ సీడ్ కారెన్ కచనోవ్ (రష్యా) 6–4, 6–1, 3–6, 7–6 (7/5)తో తనాసి కొకినాకిస్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించి నాలుగో రౌండ్‌లో అడుగు పెట్టాడు.
సాకేత్ జోడీ ఓటమి
మెన్స్ డబుల్స్‌లో ఇండియా జంట సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. రెండో రౌండ్‌లో సాకేత్–యూకీ ద్వయం 4–6, 5–7తో తొమ్మిదో సీడ్ గోంజాలెజ్(మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో వరుస సెట్లలో ఓడింది.