రైతుల మధ్య గలాట సృష్టించే ప్రయత్నాలు

రైతుల మధ్య గలాట సృష్టించే ప్రయత్నాలు
  • రిజర్వాయర్ రద్దు చేసి భూములు రైతులకు వాపస్ ఇవ్వాలె
  • బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ

గద్వాల, వెలుగు: నడిగడ్డలోని అలంపూర్, గద్వాల రైతుల మధ్య చిచ్చుపెట్టాలని సర్కారు చూస్తోందని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి రైతుల నిరసన దీక్షకు డీకే అరుణ శుక్రవారం సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చిన్నోనిపల్లి రిజర్వాయర్ కింద ఆయకట్టు లేదన్నారు. ఈ రిజర్వాయర్ నిర్మించి ఆర్డీఎస్ కు లింక్ కెనాల్ ద్వారా నీరు ఇచ్చే ప్రయత్నం చేసి నడిగడ్డలో రెండు నియోజకవర్గాల రైతుల మధ్య గలాట సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆయకట్టు లేనందువల్ల గతంలో రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకున్నామన్నారు. కానీ కమీషన్ల కోసం పనులు అడ్డుకున్నామని చెప్పి కేసులు పెట్టారని అన్నారు. 

రిజర్వాయర్ తో ఎలాంటి ఉపయోగం లేదని, వెంటనే రిజర్వాయర్ రద్దు చేసి రైతులకు భూములు వాపస్ ఇవ్వాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాస్తానన్నారు. నెట్టంపాడు ఎత్తిపోతల పథకం పనులు ఇంకా 10 శాతం పూర్తి చేయాల్సి ఉందని గతంలో సీఎం దృష్టికి తీసుకెళ్తే హెలికాప్టర్​లో వచ్చి పరిశీలన చేస్తామని హామీ ఇచ్చి రాలేదన్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా హెలికాప్టర్ లో ఆఫీసర్లను పంపించి ఇక్కడి రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ముచ్చోనిపల్లి రిజర్వాయర్ ద్వారా ఆయకట్టుకు నీరు ఇవ్వవచ్చన్నారు. ఇంత మంచి అవకాశం ఉన్నా ఎందుకు మొండిగా రిజర్వాయర్ కడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రైతులంతా ఐక్యంగా ఉంటూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని, తామూ మద్దతు ఇస్తామన్నారు.