కరోనా నివారణపై కేటీఆర్‌ చెప్పేవన్నీ అబద్ధాలే

కరోనా నివారణపై కేటీఆర్‌ చెప్పేవన్నీ అబద్ధాలే

హైదరాబాద్: ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికలుగా మంత్రి కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కళ్లు లేని కబోదిలా కేంద్రంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, అయినా ట్విట్టర్ పిట్ట కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. 

‘టీఆర్ఎస్ నాయకులు ప్రజల జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారు. భారత్ బయోటెక్‌‌ను ఒక్కసారైనా సందర్శించారా? పరిశ్రమ శాఖ మంత్రిగా కేటీఆర్ ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న వ్యాక్సిన్ కేంద్రానిదే. ప్రజలకు వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఏనాడైనా చెప్పారా? వ్యాక్సినేషన్‌‌పై దుష్ప్రచారం చేశారు. కానీ ప్రజలకు విశ్వాసం కల్పించారా? ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలి. ఎక్కడపడితే అక్కడ భూములు కబ్జా చేయడం తప్ప ప్రజలకు చేసిందేంటి? మిమ్మల్ని వదిలిపెట్టం. మీ వైఫల్యాలపై బీజేపీ వెంటాడుతుంది. గ్రామాల్లో చాలా మంది వ్యాక్సినేషన్ కోసం ముందుకు రావడం లేదు. వారికి అవగాహన కల్పించాలి. రాజకీయాలు మానాలి. శవాల మీద పేలాలు ఏరుకునట్టు చేయకండి’ అని డీకే అరుణ ఫైర్ అయ్యారు.