- ఎంపీ డీకే అరుణ డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ రెండేండ్ల పాలనలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ అంశాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను పూర్తి చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకుంటుందా? అని ప్రశ్నించారు.
రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నయాపైసా ఇవ్వలేదన్నారు. కేంద్ర పథకాల కింద వచ్చిన నిధులతోనే పంచాయతీల అభివృద్ధి జరిగిందని.. అందువల్ల కాంగ్రెస్ నాయకులకు ఓటు అడిగే నైతిక అర్హత లేదని అన్నారు.
గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. హిల్ట్ పాలసీ పేరిట భూముల కుంభకోణానికి తెరలేపి, లక్షల కోట్ల రూపాయలు జేబులో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. కేసీఆర్ భూములు అమ్మి ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చారని.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారని విమర్శించారు.
