నన్ను ఎమ్మెల్యేగా గుర్తించండి: డీకే అరుణ 

నన్ను ఎమ్మెల్యేగా గుర్తించండి: డీకే అరుణ 

హైదరాబాద్, వెలుగు: గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిని అనర్హునిగా ప్రకటిస్తూ... తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలను మంగళవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులుకు అందించారు. తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యాలయానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆఫీసు సిబ్బందికి కాపీలను అందజేశారు. తనకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించాలని అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. తర్వాత డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ.. తనను ఎమ్యెల్యేగా గుర్తిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. 

దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసిందని తెలిపారు. తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్ లో వెంటనే తన పేరు పబ్లిష్ చేయాలని సెక్రటరీని కోరినట్లు ఆమె చెప్పారు. వీలైనంత త్వరగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇప్పటికే లేట్ అయిందని కార్యదర్శికి వివరించినట్లు తెలిపారు. సుప్రీం కోర్టులో కృష్ణ మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ గురించి తమ లాయర్లు చూసుకుంటారన్నారు. 

హైకోర్టులో కౌంటర్ వేయకుండా సుప్రీం కోర్టుకు వెళ్లారని వివరించారు. ఉద్దేశపూర్వకంగానే కేసును తప్పు దారి పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. 2019, డిసెంబర్ లో తాను పిటిషన్ వేశానని, అప్పటి నుంచి ఆయన కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. అప్పుడు హైకోర్టుని ఆశ్రయించకుండా ఇప్పుడెందుకు సుప్రీం కోర్టుకు వెళ్లారని విమర్శించారు.