రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తోంది : డీకే అరుణ 

రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తోంది : డీకే అరుణ 

కర్నాటక అసెంబ్లీ ఫలితాలకు భవిష్యత్తులో తెలంగాణలో జరిగే ఎలక్షన్స్ ఫలితాలకు ఎలాంటి పొంతన ఉండదన్నారు  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కొంతమంది దీనిపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమే అని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. తమకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో డీకే అరుణ ఈ కామెంట్స్  చేశారు. 

జూన్ 25వ తేదీన నాగర్ కర్నూల్ లో నిర్వహించబోయే జేపీ నడ్డా సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు డీకే అరుణ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతలు శంకుస్థాపనలతో నానా హడావిడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరుకు ఒరిగిందేమీ లేదన్నారు. పాలమూరు జిల్లా నుంచి వలసలు ఆగిపోయాయని చెప్పడం పచ్చి అబద్దం అని చెప్పారు. కేంద్రం నిధులు లేకుండా ఒక్క అభివృద్ధి పనులైన జరిగాయా..? అని ప్రశ్నించారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఓ వైపు కేసీఆర్ కుటుంబం.. మరోవైపు బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర సంపదను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.