
- కేసీఆర్‌ది ఫామ్ హౌస్పాలన..బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్
- బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ.. కేసీఆర్ రాష్ట్ర స్థాయి లీడరే
- రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నరు
- డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం
- మీడియాతో కర్నాటక డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు: కర్నాటక, తెలంగాణ పాలన మధ్య ఎంతో తేడా ఉందని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఇక్కడ ఫాంహౌస్ పాలన నడుస్తుంటే, కర్నాటకలో సెక్రటేరియెట్ పాలన సాగుతున్నదని ఆయన గుర్తుచేశారు. బీఆర్ఎస్ వాళ్లు వస్తామంటే బస్సులో తీసుకెళ్లి కర్నాటక సుపరిపాలనను చూపిస్తామన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీటీం అని, కర్నాటక ఎన్నికల్లో కమలం పార్టీకి బీఆర్ఎస్ నేతలు సహకరించారన్నారు.
శనివారం ఆయన హైదరాబాద్‌లోని పార్క్ హోటల్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు పదేండ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయారని, అందరూ మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ పరంగా నష్టపోతామని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, కాంగ్రెస్‌ను గెలిపించి రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కర్నాటకలో ఇచ్చిన ఐదు హామీల్లో 4 హామీలను నెరవేర్చామని, మరో హామీని జనవరిలో అమలు చేస్తామని తెలిపారు. డిసెంబర్9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.
విలీనం చేస్తానని మోసం
బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీయేనని, కేసీఆర్‌ను జాతీయ స్థాయి నాయకుడిగా ఎవరూ చూడటం లేదని, ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడేనని డీకే శివకుమార్ పేర్కొన్నారు. కర్నాటకలో 1.65 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కరెంట్ఇస్తున్నామని చెప్పారు. కోటి మంది మహిళలకు గృహలక్ష్మి కింద నెలకు రూ.2 వేలు ఇస్తున్నామన్నారు. గత ఆరు నెలల్లోనే 100 కోట్ల ఫ్రీ టికెట్లను మహిళలకు అందించామన్నారు. తెలంగాణలోనూ గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు.
కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ను విలీనం చేస్తానన్న కేసీఆర్. వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాము తెలంగాణకు సాయం చేస్తున్నామని విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్ పోస్టులున్నాయి కదా అని ప్రశ్నించారు. కర్నాటకలో అవసరం ఉన్న కొన్ని వర్గాలకు మాత్రమే 24 గంటల కరెంట్ఇస్తున్నామని తెలిపారు. డిస్కంలకు చెల్లించాల్సిన ప్రతి రూపాయి చెల్లించామని, కానీ, కేసీఆర్ ప్రభుత్వం రూ.65 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని గుర్తు చేశారు.
అంజన్‌కుమార్‌ను ఆశీర్వదించండి: డీకే
ముషీరాబాద్, వెలుగు: కేసీఆర్, కేటీఆర్ దమ్ముంటే కర్నాటకకు వస్తే, ఐదు గ్యారంటీల అమలు నిరూపిస్తానని డీకే శివకుమార్ సవాల్ విసిరారు. శనివారం రాత్రి అశోక్ నగర్ చౌరస్తాలో ముషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాలకు తన మద్దతు ప్రకటిస్తూ వచ్చిన కేసీఆర్, మోదీలు ఇద్దరూ ఒకటేనని ఎద్దేవా చేశారు. అంజన్ కుమార్ యాదవ్ ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని, ఆయనను ఆశీర్వదిస్తే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మీకాంత్ సునీల్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.