కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై.. సింగపూర్ కుట్ర : డీకే శివకుమార్‌

కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై.. సింగపూర్ కుట్ర :  డీకే శివకుమార్‌

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సంచలన ఆరోపణలు చేశారు. తమ  ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, జేడీఎస్‌లు కలిసి కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.  బీజేపీ, జేడీఎస్‌ నేతలు పొత్తు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని,  ఈ కుట్రకు బెంగుళూరు, ఢిల్లీలో కాకుండా సింగపూర్ లో చర్చలు జరుగుతున్నట్లుగా తన వద్ద సమాచారం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలల అవుతున్న క్రమంలో డీకే చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.  

అయితే శివకుమార్‌  కామెంట్స్ ను  జేడీ-ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం ఖండించారు. బీజేపీ, తమ పార్టీ మధ్య పొత్తు వల్ల 85 సీట్లు మాత్రమే వస్తాయని ఇంకా 50 సీట్లు కావాలని చెప్పారు. దీని గురించి ఎందుకు పట్టించుకుంటున్నారని ప్రశ్నించారు.  ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తమకు అలాంటి ఆలోచనలు లేవన్నారు.   

శివకుమార్ కామెంట్స్ ను కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ సమర్థించారు, ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీకి మంచి ఖ్యాతి ఉందని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని కర్ణాటక మంత్రి ఆరోపించారు. ఈ క్రమంలో తాము అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.