కర్ణాటక డిప్యూటీ సీఎం.. డీకే శివకుమార్ కాన్వాయ్ వెహికల్ బోల్తా.. ఐదుగురికి గాయాలు

కర్ణాటక డిప్యూటీ సీఎం.. డీకే శివకుమార్ కాన్వాయ్ వెహికల్ బోల్తా.. ఐదుగురికి గాయాలు

మాండ్యా: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం ఆయన కాన్వాయ్లోని వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఆ వెహికల్ డ్రైవర్తో పాటు డీకే శివకుమార్ ఎస్కార్ట్ సిబ్బందికి గాయాలయ్యాయి. మాండ్యా జిల్లాలో ఈ ఘటన జరిగింది. గాయపడిన క్షతగాత్రులను మైసూర్ హాస్పిటల్కు డీకే శివకుమార్ దగ్గరుండి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం డీకే ఆదేశాలతో ఎస్పీ మల్లిఖార్జున్ బలదండి హాస్పిటల్కు వెళ్లి  వైద్యం జరుగుతున్న తీరును పరిశీలించారు.

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మైసూర్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతుండగా ఆయన కాన్వాయ్లోని వాహనం ప్రమాదానికి గురి కావడం గమనార్హం. డ్రైవర్ అతి వేగంగా వెళ్లడంతో వాహనం అదుపు తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వాహనం పాక్షికంగా డ్యామేజ్ అయింది. గాయపడిన వారిని ప్రథమ చికిత్స నిమిత్తం శ్రీరంగపట్న తాలూకా హాస్పిటల్కు తరలించి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం మైసూర్లోని కేఆర్ హాస్పిటల్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీరంగపట్న రూరల్ పోలీసులు ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేశారు.

2023లో జరిగిన కర్ణాటక ఎన్నికల ప్రచారం సమయంలో కూడా డీకే శివకుమార్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బెంగళూరు నుంచి కోలార్కు హెలికాప్టర్లో బయల్దేరారు.  ఈ క్రమంలో ఆకాశంలో ఉండగానే హెలికాప్టర్ను 100 అడుగుల ఎత్తులో ఉండగా రాబందు తాకింది. దీంతో ముందు వైపు అద్దానికి పగుళ్లు వచ్చాయి. ఆ పగుళ్లు గాలి వేగానికి పెద్దవిగా మారాయి. అయితే ముందుగానే  ప్రమాదాన్ని గుర్తించిన పైలెట్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా హెలికాప్టర్ అద్దం పూర్తిగా ధ్వంసమయింది. ఈ ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా బయటపడ్డారు.