141 స్థానాల్లో గెలుపు మాదే.. హంగ్​కు అవకాశమే లేదు : డీకే శివకుమార్

141 స్థానాల్లో గెలుపు మాదే..  హంగ్​కు అవకాశమే లేదు : డీకే శివకుమార్

141 స్థానాల్లో గెలుపు మాదే
కాంగ్రెస్ కర్నాటక చీఫ్​ డీకే శివకుమార్
హంగ్​కు అవకాశమే లేదు
ఎవరు ఎవరితో వెళ్లినా అధికారం తమదే అని ధీమా

బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ స్టేట్ చీఫ్ డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. హంగ్​కు అవకాశమేలేదని, 141 స్థానాల్లో గెలుస్తామని స్పష్టం చేశారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. శుక్రవారం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు.

రిసార్ట్ రాజకీయాలకు అవకాశమే లేదని, 25 ఏండ్ల కిందే ఈ తరహా పాలిటిక్స్ ముగిశాయని తెలిపారు. ‘‘ఎగ్జిట్​పోల్​పై నాకు నమ్మకం లేదు. 141 స్థానాల్లో గెలుస్తామని మాత్రం చెప్పగలను. ఇంకా సీట్లు పెరుగుతాయే తప్ప తగ్గవు. జేడీఎస్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకేం సంబంధం లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్లియర్ మెజార్టీ మాకొస్తుంది. ఇక బీజేపీ, జేడీఎస్ ప్రస్తావనే రాదు”అని డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. 

ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలకు థ్యాంక్స్

‘‘మాకు అనుకూలంగా రిజల్ట్స్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలను విమర్శించడం లేదు. థ్యాంక్స్ చెబుతున్నాను. మాకు స్పష్టమైన మెజార్టీ వస్తుందనేది నా నమ్మకం. గ్రౌండ్ లెవల్​లో పార్టీని బలోపేతం చేశాం. క్షేత్ర స్థాయిలో పార్టీ లీడర్లు, కార్యకర్తలు కష్టపడ్డారు. అందుకే 141 సీట్లు వస్తాయని చెబుతున్నాను”అని డీకే శివకుమార్ అన్నారు. తాను పోటీ చేస్తున్న కనకపురలో బీజేపీ డబ్బు వెదజల్లిందని ఆరోపించారు. అయినా, తీర్పు తనకు అనుకూలంగానే వస్తుందన్నారు.

జేడీఎస్ వీడి కాంగ్రెస్​లోకొచ్చేయండి

డబ్బుకు, అధికార దుర్వినియోగానికి ఓటర్లు భయపడలేదని డీకే అన్నారు. జేడీఎస్​లో ఉండి కార్యకర్తలు కెరీర్​ను వేస్ట్ చేసుకోవద్దని, కాంగ్రెస్​లోకి వచ్చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

హైకమాండ్​దే తుది నిర్ణయం

గెలిచిన ఏ అభ్యర్థి అయినా అధికార పార్టీలో ఉండాలని కోరుకుంటాడని డీకే శివకుమార్ అన్నారు. రిసార్ట్ రాజకీయాలు 25 ఏండ్ల కిందే ముగిశాయని చెప్పారు. ‘‘ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. కానీ, ఇది కలగానే మిగిలిపోతుందనిపిస్తున్నది. పార్టీ చీఫ్​ ఖర్గే, సోనియా, రాహుల్​గాంధీ చెప్పిందే చేస్తాం. అధికారాన్ని పంచుకోవడం ఉండదు” అని డీకే శివకుమార్​ స్పష్టం చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ హైకమాండే సీఎంను నిర్ణయిస్తుందని తెలిపారు..