తెలంగాణ లో కాంగ్రెస్​కు డీఎంకే మద్దతు

తెలంగాణ లో కాంగ్రెస్​కు డీఎంకే మద్దతు
  • రాష్ట్రంలో ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు
  • ఐదు నియోజకవర్గాల్లో తమిళ ఓటర్ల ప్రభావం 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీకి తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్​అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తామని తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్​ఆదేశాలతో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్టు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ‘‘తెలంగాణలోని డీఎంకే పార్టీ శ్రేణులు, అన్ని విభాగాల నేతలు కాంగ్రెస్​కు మద్దతుగా నిలవాలి. ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి. ఇందుకోసం ఎలక్షన్​ వర్కింగ్​ కమిటీని ఏర్పాటు చేయాలి. భారీ మెజారిటీతో కాంగ్రెస్​ అభ్యర్థులు గెలిచేలా ప్రచారం నిర్వహించాలి’’ అని అందులో పేర్కొంది. కాగా, తమకు మద్దతు ఇచ్చినందుకు డీఎంకేకు కాంగ్రెస్​కృతజ్ఞతలు తెలిపింది. 

నాలుగైదు సీట్లలో తమిళుల ప్రభావం..

రాష్ట్రంలోని నాలుగైదు నియోజకవర్గాల్లో తమిళుల ప్రభావం ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లోనే నాలుగు నియోజకవర్గాల్లో తమిళ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్​లలో చెప్పుకోదగిన స్థాయిలో తమిళ సెటిలర్లు ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలోనూ తమిళ ప్రజలు నివసిస్తున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు ఉండడంతో చాలామంది వచ్చి సెటిల్ అయ్యారు. ఈ ఐదు నియోజకవర్గాల్లో దాదాపు సగం మంది దాకా తమిళ ఓటర్లు ఉంటారని అంచనా. ఇక సికింద్రాబాద్​, కంటోన్మెంట్ లో భారీగా తమిళ ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు డీఎంకే పిలుపుతో అక్కడి తమిళులు కాంగ్రెస్​వైపే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

ప్రచారానికి స్టాలిన్? 

కాంగ్రెస్​కు డీఎంకే మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. అంతేకాకుండా తమిళనాడు నుంచి డీఎంకే కీలక నేతలనూ ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. తమిళుల ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్​వంటి వారితో ప్రచారం చేయిస్తే కాంగ్రెస్​కు కలిసి వస్తుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.