పుదుచ్చేరి: డీఎంకే– కాంగ్రెస్ ఒక గందరగోళ కూటమి, ఏఐఎన్‌ఆర్– బీజేపీ ఒక శక్తి లేని కూటమి అని తమిళ వెట్రికళగం (టీవీకే) చీఫ్ విజయ్ అన్నారు. దశాబ్దాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. ఈ మేరకు శనివారం పుదుచ్చేరిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో విజయ్ ప్రసంగించారు. టీవీకే అధికారంలోకి వస్తే లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్‌జీ) జోక్యం లేని పాలనను అందిస్తామని, పుదుచ్చేరికి చట్టబద్ధంగా రాష్ట్ర హోదా సాధించేందుకు 100 శాతం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఓటర్లను ఆకట్టుకునేందుకు విజయ్ పలు జనాకర్షక పథకాలను ప్రకటించారు. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని హామీ ఇచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని తెలిపారు. పుదుచ్చేరిలో ‘యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్’ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. టీవీకే పార్టీ గుర్తు అయిన ‘విజిల్’కు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. తమ అభ్యర్థులు ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడతారని, పారదర్శకమైన, సురక్షితమైన పాలన అందించేందుకు తమకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.
