డీఎంకే లీడర్​ వివాదాస్పద కామెంట్స్.. తర్వాత సారీ చెప్పిన నేత సైదాయి

డీఎంకే లీడర్​ వివాదాస్పద కామెంట్స్.. తర్వాత సారీ చెప్పిన నేత సైదాయి

చెన్నై : బీజేపీలో చేరిన హీరోయిన్లు నలుగురూ ఐటమ్ ​లేనంటూ డీఎంకే లీడర్​ సైదాయి సాదిక్​ శుక్రవారం వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్​ను కుష్బూ ట్విట్టర్లో పెట్టి తనను ట్యాగ్​ చేయడంతో డీఎంకే లీడర్​ కనిమొళి సారీ చెప్పారు. ఆ తర్వాత సైదాయి సాదిక్​ కూడా సారీ చెప్పారు. అదే సమయంలో తమ పార్టీ లీడర్లను తిట్టినప్పుడు బీజేపీ పెద్దలు స్పందించలేదేమని ఆయన ప్రశ్నించారు.

ఏం జరిగింది..

ఆర్కేపురంలో డీఎంకే ఏర్పాటుచేసిన ఓ పబ్లిక్​ మీటింగ్​లో సైదాయి సాదిక్​ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీలో చేరిన మాజీ హీరోయిన్లు నలుగురూ ఐటమ్​లేనని అన్నారు. తమిళనాడు బీజేపీ నేతలు మాజీ హీరోయిన్లు కుష్బూ, నమిత, గౌతమి, గాయత్రిలను ఉద్దేశించి ఆయనీ కామెంట్స్ చేశారు. బురదలో నుంచే కమలం వికసించినట్లు తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న కుష్బూ కామెంట్స్​ను ప్రస్తావిస్తూ.. అమిత్​ షా నెత్తిపైన జుట్టు మొలుస్తుందేమో కానీ తమిళనాడులో కమలం వికసించేందుకు అవకాశమే లేదని సాదిక్​ చెప్పారు.

బహుశా పెంపకలోపమే.. కుష్బూ..

సాదిక్​ కామెంట్స్​పై బీజేపీ లీడర్​ కుష్బూ మండిపడ్డారు. ‘మహిళలను తిట్టే మగవాళ్ల విషయంలో రెండు రకాల పొరపాట్లు జరిగి ఉండొచ్చు.. అయితే, పెంపకంలో లోపం వల్ల లేదంటే వారు విషపూరితమైన వాతావరణంలో పెరగడం వల్ల అలా తయారవుతారు. ఇలాంటి వాళ్లే మళ్లీ దివంగత నేత కలైనార్​ ఫాలోవర్లమని చెప్పుకుంటారు. స్టాలిన్​ పాలనలో రాష్ట్రంలో ఇలాంటి ద్రవిడ మోడల్​నే అమలు చేస్తున్నారా?’ అని ట్విట్టర్లో ప్రశ్నించారు. కనిమొళిని ట్యాగ్​ చేయడంతో ఆమె స్పందించి, క్షమాపణ చెప్పారు.