సస్పెండ్ అయినా చెయ్యండి.. మైక్ అయినా ఇవ్వండి

సస్పెండ్ అయినా చెయ్యండి.. మైక్ అయినా ఇవ్వండి
  •     మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ
  •     సభలో గందరగోళంపై మండిపాటు

హైదరాబాద్, వెలుగు: సభను ఆర్డర్​లో పెట్టడమో, లేదంటే గందరగోళం సృష్టిస్తున్న సభ్యులను సస్పెండ్ చేయడమో ఏదో ఒకటి చేయాలని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌ను కోరారు. గురువారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అవమానించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. 

స్పీకర్ ఎంత కోరినా బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు వెనక్కితగ్గకపోవడంతో అసహనానికి గురైన అక్బరుద్దీన్ ఒవైసీ కలుగజేసుకుని సభను ఆర్డర్​లో పెట్టాలని కోరారు. నిన్నటి సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పేరును ప్రస్తావించారు కనుక.. వివరణ ఇచ్చుకోవాల్సిన హక్కు ఆమెకు ఉందన్నారు. ఆమెకు మైక్ ఇవ్వకపోవడం సరికాదని, అదే సమయంలో సభలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిబంధనల ప్రకారం సస్పెండ్ చేయాలన్నారు. 

కానీ, ఆ పని స్పీకర్ చేయడం లేదని, అలాగని మైక్ కూడా ఇవ్వడం లేదని, ఇది సరికాదని అక్బరుద్దీన్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో సభ్యులు ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. అధికార పక్షం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, స్పీకర్ సభను వాయిదా వేసి ప్రతిపక్ష పార్టీల నేతలను తన చాంబర్​లోకి పిలిపించి మాట్లాడి సభను సజావుగా జరిగేలా చూడాలని సూచించారు.