న్యూఢిల్లీ: కోర్టులు బెయిల్ పిటిషన్లను ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్ పిటిషన్లపై నిర్ణయాలు తీసుకోవడంలో ఒక్క రోజు ఆలస్యమైనా అది పౌరుల ప్రాథమిక హక్కులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉంచే విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టులో తన బెయిల్ పిటిషన్ గతేడాది ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉందని.. దానిపై కోర్టు నిర్ణయం తీసుకోవడం లేదంటూ ఓ వ్యక్తి సుప్రీంను ఆశ్రయించాడు.
ఆ పిటిషన్‌ను జస్టిస్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ శుక్రవారం విచారించింది. పిటిషనర్ తరపు లాయర్ వాదిస్తూ.. ఎలాంటి విచారణ లేకుండానే అలహాబాద్ హైకోర్టులో తమ బెయిల్ పిటిషన్ పదేపదే వాయిదా వేసినట్లు తెలిపారు. దీనిపై బెంచ్ అసహనం వ్యక్తంచేసింది. బెయిల్ పిటిషన్‌పై నిర్ణయంలో జాప్యం జరిగితే పౌరుల ప్రాథమిక హక్కులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కింది కోర్టులకు తెలిపింది. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.