మూసీ సుందరీకరణతో పేదలకు నష్టం చేయం: మంత్రి శ్రీధర్​ బాబు

మూసీ సుందరీకరణతో పేదలకు నష్టం చేయం: మంత్రి శ్రీధర్​ బాబు
  • అందరి సలహాలు, సూచనలు తీసుకుంటం: మంత్రి శ్రీధర్​ బాబు

  • శ్రీధర్​బాబు, పీసీసీ  చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​కు 20 సంఘాల రిప్రజెంటేషన్

హైదరాబాద్, వెలుగు: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో పేదలు నష్టపోకుండా చూస్తామని మంత్రి శ్రీధర్​ బాబు హామీ ఇచ్చారు. అందరి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. గురువారం ఎంసీఆర్​హెచ్​ఆర్​డీలో శ్రీధర్​ బాబు, పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ను 20కిపైగా స్వచ్ఛంద సంస్థలు కలిసి వినతిపత్రాన్ని ఇచ్చాయి. ఈ సందర్భంగా శ్రీధర్​ బాబు వారితో మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా.. ఏకపక్షంగా వ్యవహరించొద్దని అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాలిచ్చారని చెప్పారు. 

మూసీ నదిలో ఇండ్లు కట్టుకున్న వారికి పునరావాసం కల్పిస్తామని, ఎవరినీ రోడ్ల మీద వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తెలిసో తెలియకో వారంతా మురుగునీటి ప్రవాహం పక్కన నివాసాలు నిర్మించుకున్నారని తెలిపారు. మూసీకి లక్ష క్యూసెక్కులకు పైగా భారీ వరద వచ్చినప్పుడు రివర్​ బెడ్​లో ఉన్న ప్రజానీకానికి ప్రాణాపాయం, ఆస్తి నష్టం జరుగుతుందన్నదే తమ ఆందోళన అని వివరించారు. బఫర్​జోన్​లో ఆక్రమణల తొలగింపు విషయంలో కూడా అందరి అభిప్రాయాలను సానుకూలంగా వింటామని తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనంతో పాటు రెండు వైపులా ఉన్న పురాతన ఆలయాలు, సంస్కృతి చిహ్నాలను కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని శ్రీధర్ బాబు చెప్పారు. 

ఈ ప్రాజెక్టుతో మూసీ పరీవాహక ప్రాంతమంతా పర్యాటక కేంద్రంగా మారుతుందని, వేలాది మంది స్థానికులకు ఉపాధి దొరుకుతుందని వివరించారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు ఏ ఆపద వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరు రెచ్చగొట్టినా, ప్రలోభ పెట్టాలని చూసినా అనవసర ఆవేశాలకు పోవొద్దని  మంత్రి సూచించారు. కొందరు వారిని రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నారని, దానివల్ల పేదలకే నష్టం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో రైతు సంక్షేమ కమిషన్​ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్​ హరగోపాల్, ప్రొఫెసర్​ శాంతాసిన్హా తదితరులు పాల్గొన్నారు.