ఈపీఎఫ్‌ లో సీఎంపీఎఫ్‌ ను విలీనం చేయొద్దు

ఈపీఎఫ్‌ లో సీఎంపీఎఫ్‌ ను విలీనం చేయొద్దు

గోదావరిఖని, వెలుగుఎంప్లాయిస్ ప్రావిడెంట్‌‌‌‌ ఫండ్‌‌(ఈపీఎఫ్‌‌‌‌)లో కోల్‌‌‌‌మైన్స్‌‌‌‌ ప్రావిడెంట్‌‌‌‌ ఫండ్‌‌‌‌(సీఎంపీఎఫ్‌‌‌‌)ను విలీనం చేయాలనే ప్రతిపాదన విరమించుకోవాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత డాక్టర్‌‌‌‌ జి.వివేక్‌‌‌‌ వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈపీఎఫ్‌‌‌‌లో సీఎంపీఎఫ్‌‌‌‌ను విలీనం చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికులతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉన్న సింగరేణి కార్మికులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఈ ప్రతిపాదనను విరమించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి లేఖ రాశారు.

సీఎంపీఎఫ్ కింద కార్మికులకు పెన్షన్

1948లో ‘కోల్‌‌‌‌మైన్స్‌‌‌‌ ప్రావిడెంట్‌‌‌‌ అండ్‌‌‌‌ బోనస్‌‌‌‌ యాక్ట్‌‌’ తీసుకురాగా, అందులో బోనస్‌‌‌‌ అనే పదాన్ని తొలగించి ‘ది కోల్‌‌‌‌ మైన్స్‌‌‌‌ ప్రావిడెంట్‌‌‌‌ ఫండ్ అండ్‌‌‌‌ మిసిలేనియస్‌‌‌‌ ప్రోవిజన్స్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ 1948(సీఎంపీఎఫ్‌‌)’గా మార్పు చేశారని, ఆనాటి నుంచి బొగ్గు గని కార్మికులు ఈ యాక్టు కిందే ప్రావిడెంట్‌‌‌‌ ఫండ్‌‌‌‌ డబ్బులతోపాటు పెన్షన్‌‌‌‌ కూడా తీసుకుంటున్నారని వివేక్‌‌‌‌ గుర్తు చేశారు. 1948లో సీఎంపీఎఫ్‌‌‌‌  యాక్టు తీసుకొస్తే.. 1952లో ఈపీఎఫ్‌‌‌‌ యాక్టును తీసుకువచ్చారని తెలిపారు. సీఎంపీఎఫ్‌‌‌‌లో 12 శాతం కార్మికుడి వాటా చెల్లిస్తే, మరో 12 శాతం యాజమాన్యం వాటాగా జమ చేసేదని, ఇందులో 10.48 శాతం వాటా డబ్బులు కార్మికుడు పదవీ విరమణ చేసేటప్పుడు చెల్లించగా, 1.16 శాతం డబ్బులను పెన్షన్‌‌‌‌ రూపంలో చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు.

గని కార్మికులకు ఎంతో నష్టం

సీఎంపీఎఫ్‌‌‌‌ కింద కార్మికుడు తన వేతనం ఆధారంగా పెన్షన్‌‌‌‌ ఎంతైనా తీసుకునే వీలుంటుందని, ఈపీఎఫ్‌‌‌‌ ద్వారా ఎంత వేతనం పొందినా పెన్షన్‌‌‌‌ రూ.15 వేల లోపే సీలింగ్‌‌‌‌ ఉంటుందని, దీంతో కార్మికులు ఎక్కువ నష్టపోయే అవకాశం ఏర్పడుతుందని వివేక్‌‌‌‌ చెప్పారు. గతంలో ఇదే ప్రతిపాదన వస్తే 2017 మేలో పదో వేజ్‌‌‌‌ బోర్డు సమావేశంలో చర్చించారని, దీన్ని వ్యతిరేకిస్తూ జూన్‌‌‌‌ లో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె కూడా చేపట్టారని ఆయన గుర్తు చేశారు. కార్మికులు నష్టపోయే అవకాశం ఉన్నందున సీఎంపీఎఫ్‌‌‌‌ను ఈపీఎఫ్‌‌‌‌లో విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకునేలా బోర్డ్​ ఆఫ్‌‌‌‌ ట్రస్టీలు, ఇతర విభాగాలతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని వివేక్‌‌‌‌ కోరారు.