అండాశయ క్యాన్సర్ పై అశ్రద్ధ వద్దు..మెడికవర్ హాస్పిటల్​లోఅవగాహన కార్యక్రమం

అండాశయ క్యాన్సర్ పై అశ్రద్ధ వద్దు..మెడికవర్ హాస్పిటల్​లోఅవగాహన కార్యక్రమం

హైదరాబాద్, వెలుగు: అండాశయ క్యాన్సర్ పై అశ్రద్ధ చూపొద్దన్ని మెడికవర్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్ డాక్టర్లు సూచించారు. అండాశయ క్యాన్సర్ 50 ఏండ్లు దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందని, ప్రత్యేకమైన లక్షణాలు లేకపోవడం వల్ల చాలామంది దీన్ని పట్టించుకోరన్నారు. అజీర్ణం, పొత్తికడుపు నొప్పి, అలసట, వెన్నునొప్పి, మలబద్ధకం, తరచూ మూత్రవిసర్జన లక్షణాలు  కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. 

గురువారం హైదరాబాద్ లోని మెడికవర్ ఆసుపత్రిలో అండాశయ క్యాన్సర్ పై మెడికవర్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్ డాక్టర్లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలి, వంశపారంపర్య లక్షణాలు, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వంటి అంశాలు ఈ వ్యాధికి కారణాలు కావచ్చన్నారు. 

మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, హార్మోన్ థెరపీ వంటి మార్గాలను పాటించడం ద్వారా అండాశయ క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చన్నారు. సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ రవి చందర్ వెలిగేటి, సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి, కన్సల్టెంట్ మెడికల్, హెమటో ఆంకాలజీ డాక్టర్ సరితా శ్రీవాస్తవ ఇతర అంకాలజీ డాక్టర్లు పాల్గొన్నారు.