కబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? : ఎమ్మెల్యే మురళీనాయక్

కబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? : ఎమ్మెల్యే మురళీనాయక్
  • మాజీ ఎమ్మెల్యే శంకర్​నాయక్​కు ఎమ్మెల్యే మురళీనాయక్  ​సవాల్​

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్​నియోజకవర్గంలో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో, ఎవరు కబ్జాలకు పాల్పడ్డారో బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే మురళీనాయక్​మాజీ ఎమ్మెల్యే శంకర్​నాయక్​కు సవాల్​విసిరారు. ఆయనకు కబ్జాల మీద ఉన్న సోయి అభివృద్ధి మీద లేదని ఆరోపించారు. పదేళ్లలో చేయని అభివృద్ధి పనులను రెండేళ్లలోనే చేసి చూపించామని పేర్కొన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జమండ్లపల్లి మున్నేరు వాగు వద్ద రూ.3 కోట్లతో నిర్మించనున్న బతుకమ్మ ఘాట్, అంబేద్కర్ కాలనీలో రూ.66 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి సుమారు రూ.79 కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తుంటే శంకర్ నాయక్ ఓర్వలేకపోతున్నారని, కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయం చేస్తున్నారని, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. మున్సిపల్​ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళీనాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గణపురం అంజయ్య తదితరులున్నారు.