నిజామాబాద్, వెలుగు : విద్యార్థినులను సమర్థులుగా తీర్చిదిద్దడమే కాకుండా, మానసికంగా, సామాజికంగా దృఢంగా మార్చే వికాస కేంద్రాలుగా కేజీబీవీ, మోడల్ స్కూల్స్ పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం నగరంలోని కపిల హోటల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన స్పెషల్ ఆఫీసర్లు, కేర్ టేకర్లు, వార్డెన్ల ఐదు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. బాలికల పట్ల ఆప్యాయత చూపితే తమ ఇబ్బందులను టీచర్లకు నిర్భయంగా చెబుతారన్నారు.
గర్ల్స్ మానసిక స్థితిని నిరంతరం గమనించాలన్నారు. గుడ్‌టచ్ బ్యాడ్ టచ్‌పై సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. డీఈవో అశోక్, ఉమ్మడి జిల్లా జీసీడీవోలు భాగలక్ష్మి, సుకన్య, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. తరువాత గంగస్థాన్ నార్త్ మండలంలోని కస్తూర్బా గాంధీ స్కూల్‌ను కలెక్టర్ విజిట్ చేసి డార్మెటరీ, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. క్లాస్ రూమ్స్ సందర్శించి స్టూడెంట్స్‌కు పాఠాలు బోధించారు. వారితో కలిసి చెస్ ఆడారు. వెంట తెచ్చిన చాక్లెట్స్, బిస్కెట్స్ పంచారు.
భూసేకరణలో స్పీడ్ పెంచాలి..
జిల్లాలో నేషనల్ హైవేల నిర్మాణ పనులకు ఆటంకం కలుగకుండా భూసేకరణలో వేగం పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఆర్మూర్-మంచిర్యాల, మద్నూర్-రుద్రూర్, బోధన్-బాసర రోడ్ పనుల ప్రగతిని సమీక్షించారు. సబ్ కలెక్టర్లు వికాస్‌మహతో, అభిగ్యాన్ మాల్వియా, ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.
