బోధన్, వెలుగు: అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన మరో సభ్యుడిని అరెస్ట్‌చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. గురువారం బోధన్ పట్టణం శక్కర్ నగర్‌లోని ఏసీపీ ఆఫీస్‌లో విలేకరులకు ఏసీపీ వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 21న బోధన్ ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఉన్న రెండు బంగారు దుకాణాల తాళాలు పగులగొట్టి 35 తులాల బంగారం, 14 కిలోల వెండి చోరీ చేశారని తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే లక్ష్మణ్‌సింగ్, ప్రేమ్ సింగ్‌ను పట్టుకున్నామని, 14 తులాల బంగారం, 6 కిలోల వెండి, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గురువారం మహారాష్ట్ర ఉమ్రి గ్రామానికి చెందిన మహ్మద్ మౌలాసాబ్ షేక్ ను నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్‌చేసి, కిలో వెండి, ఐదు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇంకా ఒకరు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మహ్మద్ మౌలాసాబ్ షేక్ పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ, పట్టణ ఎస్సై మనోజ్ కుమార్, ఏఎస్సై బాబురావు, సిబ్బంది కె.రవి, కె.మహేశ్, ఎ.సాయికుమార్ పాల్గొన్నారు.
