ములుగులోని ప్రతీ పల్లెకు గోదావరి జలాలు : మంత్రి సీతక్క

 ములుగులోని ప్రతీ పల్లెకు గోదావరి జలాలు :  మంత్రి సీతక్క
  • కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
  • పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: బీఆర్ఎస్ ​హయాంలో గోదావరి జిల్లాలతో ములుగుకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్​శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో రూ.143 కోట్ల లిఫ్ట్​ఇరిగేషన్ ప్రాజెక్టు, రామప్ప, లక్నవరం అనుసంధానానికి రూ.35 కోట్ల మంజూరుకు కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనివల్ల జిల్లాలో 15 వేల ఎకరాలకు సాగు నీరందడంతోపాటు జంపన్నవాగు జీవనదిగా మారనుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గురువారం ములుగు మున్సిపాలిటీ పరిధిలోని జీవంతరావుపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 

ఓ ఫంక్షన్ హాల్ లో మహిళా సంఘాల సభ్యులకు చీరలు, రూ.1.12 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాల చెక్కు అందజేశారు. ములుగు జిల్లా సమాఖ్యకు పక్కా భవనం మంజూరు చేస్తామని, ప్రతీ మహిళ సంఘంలో చేరాలని చెప్పారు. మల్లంపల్లి నుంచి ఏటూరునాగారం వరకు వ్యాపారాలు చేసుకునేందుకు, కొత్త కలెక్టరేట్, బస్టాండ్​లో షాపుల నిర్వహణకు మహిళలకు అనుమతి ఇస్తామన్నారు. ములుగు మున్సిపాలిటీలో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. సమ్మక్క జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సక్సెస్ చేయాలని కోరారు.

సీపీఐ నారాయణ ఆశీర్వాదం తీసుకున్న మంత్రి 

సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ గురువారం మేడారం జాతరకు వెళ్తూ మంత్రి సీతక్క ములుగులోనే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఓ ఫంక్షన్ హాల్​లో మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న ఆమె వద్దకు వెళ్లగా.. మంత్రి ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానించి, శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. నారాయణ మంత్రిని ఆప్యాయంగా పలకరించారు. 

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి 

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. గురువారం భూపాలపల్లిలో రూ.2 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లకు పనులకు శంకుస్థాపన చేశారు. మహిళలకు చీరలను అందజేశారు. అనంతరం బీసీ బాలుర వసతి గృహంలో సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు వచ్చే నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని చెప్పారు.

పదవులు తాత్కాలికమని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా పనులు చేపట్టాలని సూచించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే  గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, కాంగ్రెస్​జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, నాయకులు చల్లూరి మధు, ఇస్లావత్ దేవన్, అప్పం కిషన్, శిరుప అనిల్, పిప్పాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.