అవసరాన్ని మించి పెట్రోల్, డీజిల్ కొనొద్దు : డిప్యూటీ సీఎం భట్టి

అవసరాన్ని మించి పెట్రోల్, డీజిల్ కొనొద్దు :  డిప్యూటీ సీఎం భట్టి
  • రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నయ్​: డిప్యూటీ సీఎం భట్టి  

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలపై బుధ వారం శాసన మండలిలోని కాన్ఫరెన్స్ హాల్‌‌‌‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు సమీక్షించారు. 

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇంధన సరఫరాలో ఎలాంటి ఇబ్బందుల్లేవని, సోషల్ మీడియా ప్రచారాన్ని జనం నమ్మొద్దని కోరారు. అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంకుల వద్దకు వచ్చే చివరి వాహనదారుడికి కూడా ఇంధనం దొరుకుతుందనే భరోసాను జనాలకు అధికారులు, ఆయా సంస్థ ఏజెన్సీలు కల్పించాలని భట్టి కోరారు. ప్రజలకు వీటిపై భరోసా ఇచ్చేందుకు ప్రతి రోజు మీడియాకు వివరాలు అందించాలని సూచించారు. 

బ్లాక్ మార్కెటింగ్‌‌‌‌ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెట్రోల్, గ్యాస్ ఏజెన్సీలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సమీక్షలో సివిల్ సప్లయి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, పోలీసు కమిషనర్లు సజ్జనార్, సుధీర్ బాబుతో పాటు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీకి మరో ముగ్గురు ఆర్మీ నిపుణులు.. 

ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీకి మరో ముగ్గురు ఆర్మీ నిపుణులను పంపిస్తున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఇన్‌‌‌‌లెట్, ఔట్‌‌‌‌లెట్ వద్ద ఒక్కొక్కరు, మొత్తంగా మానిటరింగ్ చేసేందుకు మరొకరు ఉంటారని తెలిపారు. టన్నెల్ సెక్రటరీ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ఆర్మీ అధికారులు పనిచేయనున్నారని వెల్లడించారు. అక్కడ ఆధునాతన వెంటిలేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.