గొర్లు, బర్లతో ఆగిపోవద్దు.. చదువుతోనే ఎదుగుదాం

గొర్లు, బర్లతో ఆగిపోవద్దు.. చదువుతోనే ఎదుగుదాం
  • హరియాణ గవర్నర్ దత్తాత్రేయ
     

కరీంనగర్: గొర్లు, బర్లతో ఆగిపోవద్దు.. చదువుతోనే ఎదుగుదామని హరియాణ గవర్నర్ దత్తాత్రేయ పిలుపునిచ్చారు. గురువారం జమ్మికుంటలో గొల్ల కుర్మల సత్కార సభల హరియాణ గవర్నర్ దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను హరియాణా గవర్నర్ హోదాలో ముల్కనూరులో పడాల చంద్రయ్య అనే స్వాతంత్ర్య సమరయోధుని విగ్రహావిష్కరణకు వచ్చానని, ఇదే సందర్భంగా నన్ను ఎంతో ప్రేమతో జమ్మికుంటకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నన్ను సత్కరించినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. 
మంచి వర్షాలు కురిసి పాడిపంటలతో తులతూగాలి 
మంచి వర్షాలు కురిసి మన ప్రాంతం పాడిపంటలతో తులతూగాలని హరియాణ గవర్నర్ దత్తాత్రేయ ఆకాంక్షించారు. గొల్ల కుర్మల జాతి నుంచి కరీంనగర్ జిల్లా పరిషత్తు ఛైర్మన్ గా తుల ఉమ ఎదగడం మహిళలందరికీ గర్వకారణం అన్నారు. నేను చాలా పేదకుటుంబంలో జన్మించి గొల్లకుర్మల కుటుంబం నుంచి హరియాణా గవర్నర్ కావడం వెనక మీ అందరి ఆశీర్వాదం ఉందన్నారు. కేంద్ర మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసానంటే.. నేను చదువుకున్నందుకే ఇన్ని పదవులు దక్కాయని, మీరు కూడా మీ పిల్లలను బాగా చదివించాలన్నారు. విద్యతోనే మన అభివృద్ధి సాధ్యమవుతుందని గవర్నర్ దత్తాత్రేయ పేర్కొన్నారు. 
గొర్రెల పెంపకంతోపాటు ఇతర రంగాల్లో ఎదగాలి
గొల్లకుర్మలు ఇప్పటికీ గొర్రెలు మేపుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ గొర్రెల పెంపకంతో పాటు ఇతర రంగాల్లో మనం ఎదగాల్సిన తరుణం వచ్చిందన్నారు. గొర్రెలు, బర్రెలు ఏమిచ్చినా... తీసుకుని మనం యజమానులు కావాలని సూచించారు. పేదరికం పోవాలన్నా, ఉన్నత ఉద్యోగాలు రావాలన్నా విద్యతోనే సాధ్యమన్నారు. గొర్రెల కాపర్లుగానే మనం ఆగిపోకూడదు. పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, అనేక రంగాల్లో మనవాళ్లు ఎదగాలని కోరారు. 
ఏడో తరగతి బాలికతో గవర్నర్ ముచ్చట

హరియాణ గవర్నర్ దత్తాత్రేయ వేదికపైకి రమ్య అనే ఏడో తరగతి విద్యార్థిని పిలిపించుకుని నీవు భవిష్యత్తులో ఏం కావాలనకుంటున్నావని ప్రశ్నించారు. తాను పోలీసు కావాలనుకుంటున్నట్లు చెప్పింది చిన్నారి. ఐపీఎస్ కావాలనుకుంటున్న రమ్యను తల్లిదండ్రులు బాగా చదివించాలని గవర్నర్ దత్తాత్రేయ సూచించారు. రమ్య ఐపీఎస్ అధికారి అయ్యి ప్రజలకు సేవలందించాలని, అప్పటిదాకా రమ్యకు పెళ్లి చేయకుండా చదివించాలని కోరారు. ఇలాంటి పిల్లలే రేపటి మన భవిష్యత్తు అన్నారు. 
బ్యాంకు రుణాలు తీసుకుని అభివృద్ధి సాధించాలి
గొర్రెల కాపర్లకు, గొల్ల కుర్మలు బ్యాంకుల్లో ఇచ్చే రుణాలు తీసుకుని ఇంకా అభివృద్ధి చెందాలని హరియాణ గవర్నర్ దత్తాత్రేయ సూచించారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు 500 కోట్ల రుణాలు ఇప్పించి.. గొల్ల కుర్మల అభివృద్ధికి కృషి చేశానన్నారు. అందరికంటే ఎక్కువగా బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించేవారు గొల్లకుర్మలేనని గతంలో బ్యాంకు అధికారులు చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు. మహిళలకు మనం అత్యధిక గౌరవం ఇవ్వాలని, మహిళలను గౌరవించే సమాజమే అత్యున్నత స్థాయికి ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు.  
ఆడపిల్ల అంటే ఆటబొమ్మ కాదు ఆదిలక్ష్మి
ఆడపిల్ల అంటే ఆటబొమ్మ అనే అభిప్రాయంతో ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరగడం, ఆటబొమ్మగా భావించడం దురదృష్టకరమని గవర్నర్ దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆడపిల్ల పుడితే ఇంటికి బరువని భావించొద్దు, ఆడపిల్లల జనాభా తగ్గుతోందని, అందుకే ఆడపిల్లల కోసం బేటి పడావో, బేటీ బచావో కార్యక్రమాన్ని ప్రధాని మోడీ తెచ్చారని తెలిపారు. ఈ పథకం తర్వాత ఆడపిల్లలను ఆదిలక్ష్మిగా భావిస్తున్నారని చెప్పారు. 
సమాజంలో లింగవివక్ష పోవాలి
సమాజంలో లింగ వివక్ష సమూలంగా తొలగిపోవాల్సిన అవసరం ఉందని, స్త్రీ, పురష లింగ నిష్పత్తి సమానంగా లేకపోతే అనేక సమస్యలొస్తాయని గవర్నర్ దత్తాత్రేయ హెచ్చరించారు. ఆడపిల్లలను కూడా బాగా చదివించి ఐపీఎస్, డాక్టర్లు, రాజకీయ వేత్తలుగా, వ్యాపారస్తులుగా తీర్చిదిద్దాలని సూచించారు. గొల్ల కుర్మలను ఎస్సీల్లో కలపాలన్న డిమాండ్ ను ప్రస్తావిస్తూ.. ఈ డిమాండ్ చాలా కాలంగా ఉందని, ఎస్సీలకు వచ్చే లబ్ది కూడా గొల్ల కుర్మలకు వచ్చే అవకాశం ఉన్నందున.. గొల్ల కుర్మలను ఎస్సీల్లో కలిపేందుకు నావంతు కృషి నిరంతరం చేస్తానన్నారు. 
వరంగల్, మహబూబ్ నగర్ లో ఉన్ని పారిశ్రామిక కేంద్రాలు
హిమాచల్ ప్రదేశ్ లో చలి నుంచి కాపాడుకునేందుకు అక్కడి వారు ఉన్ని దుస్తులు వాడుతారు, గొర్రెల నుంచి ఉన్నిని తయారు చేసే పరిశ్రమలు ఏర్పాటు చేసి గొల్లకుర్మలకు అప్పగించాలని వరంగల్, మహబూబ్ నగర్ లో ఉన్ని పారిశ్రామిక కేంద్రాలు పెట్టాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని హరియాణ గవర్నర్ దత్తాత్రేయ తెలిపారు. గ్రామాల్లో ఉద్యోగాలు రాక అనేక మంది నిరుద్యోగులు బాధపడుతున్నారని, అలాంటి వారికి ఉన్ని పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కొమురవెళ్లి మల్లన్న మనకు ఆరాధ్య దైవం, కొమురవెళ్లి దేవస్థానాన్ని యాదాద్రిలాగా అభివృద్ధి చేయాలని  కోరుతున్నానన్నారు. మన దేవాలయం చాలా ప్రాచీనమైనదని, మన బతుకులు గొర్రె, బర్రెతోనే సరిపెట్టకూడదు, చదువుకుని ఉన్నతస్థానాలకు మనవాళ్లు ఎదగాలన్నారు. చిన్నచిన్నవాటితో ఆశపడి అక్కడే ఆగిపోకూడదు, రమ్యలాగా అందరూ ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్న కలలు కనాలని ఆయన సూచించారు. 
గొర్రెలు,బర్రెలతో సరిపెట్టుకోవవద్దు.. ఉన్నత లక్ష్యాలు ఉండాలి
పది గొర్రెలో, పది బర్రెలో వస్తే లాభం లేదు, తాత్కలికంగా వస్తే తీసుకోండి, కానీ మనకు ఉన్నత లక్ష్యాలు ఉండాలి, హిమాలయాలను అదిరోహించి జెండా పెట్టే స్థాయికి మనవాళ్లు ఎదగాలని హరియాణ గవర్నర్ దత్తాత్రేయ సూచించారు. మన సంస్కృతిని, సభ్యతను, మన సామాజాన్ని మరిచిపోకూడదని, మనం ఎంత ఎదగినా మనలోని నిరుపేదలను మరిచిపోకూడదన్నారు. నాకు చేసిన ఈ సన్మానం.. ఈ గౌరవం గొల్లకుర్మలకే కాదు భారత రాజ్యాంగానికి సన్మానం చేసినట్లుగా భావిస్తున్నానన్నారు. నేను గవర్నర్ గా రాజ్యాంగ పదవిలో ఉన్నా, నన్ను గౌరవించడమంటే రాజ్యాంగాన్ని గౌరవించినట్లేనని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగానికి లోబడి మన హక్కుల కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన జీవితంలోకి వెలుగులోకి తెచ్చుకోవడమే నాకు చేసే నిజమైన సన్మానమని దత్తాత్రేయ పేర్కొన్నారు.