
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించడాన్ని అమెరికా సీనియర్ జర్నలిస్టు రిక్ సాంచెజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. భారత్‌ను స్కూల్‌కు వెళ్లే చిన్నపిల్లాడిలా భావించి తమ మాటలు వినాలని అమెరికా కోరుకోవడం తప్పు అన్నారు.‘‘ఇండియా పరిణతి చెందిన యువకుడిలాంటిది, తమ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఇండియాకు తెలుసు’’ అని స్పష్టం చేశారు. క్రూడాయిల్‌ను ఎవరి నుంచి కొనుగోలు చేయాలో భారత్తనే నిర్ణయించుకుంటుందని సాంచెజ్ పేర్కొన్నారు.
చైనా, యూరప్ దేశాలు కూడా రష్యా చమురు కొంటున్నప్పుడు భారత్‌పై మాత్రమే సుంకాలు విధించడం బేధభావాన్ని చూపుతుందన్నారు. అలాగే, పాకిస్తాన్‌తో సీజ్ఫైర్లో తన పాత్ర లేదని భారత్ స్పష్టంచేసినా, ట్రంప్ అది తన విజయంగా ప్రచారం చేసుకోవడాన్ని సాంచెజ్ తప్పుబట్టారు. ఈ సుంకాలు అమెరికా పతనానికి దారితీస్తాయని, భారత్, చైనా, రష్యా, బ్రెజిల్ వంటి దేశాలు ఏకమవుతాయని హెచ్చరించారు. ఇది ప్రపంచ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చేలా ఉందని అభిప్రాయపడ్డారు.