డబుల్​బెడ్​రూం ఇళ్లు ఖాళీ చేయుమంటున్నరు..

డబుల్​బెడ్​రూం ఇళ్లు ఖాళీ చేయుమంటున్నరు..

ఆఫీసర్ల ఎదుటే ఒకరి ఆత్మహత్యాయత్నం

జూలూరుపాడు, వెలుగు: మండలంలోని పాపకొల్లు జీపీ పరిధిలో గల భీమ్లాతండాలో డబుల్ బెడ్రూం ఇల్లు ఖాళీ చేయమంటున్నారని మంగళవారం ఆఫీసర్ల ఎదుటే ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. భీమ్లాతండాలో నిర్మించిన డబుల్ బెడ్​రూం ఇండ్లలో కొంతకాలంగా భుక్యా రాందాస్ తోపాటు మరికొందరు ఉంటున్నారు. వీరందరూ స్థల ఓనర్లుగా చెప్పుకుంటున్నారు. అప్పటి ఆఫీసర్లు స్థల దాతలకు ఇండ్లను కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ఇక్కడే ఉంటున్నామని చెప్పారు. కాగా ఆఫీసర్లు లాటరీ ద్వారాఎంపికైన లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించే క్రమంలో అప్పటికే ఉంటున్నవారిని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read:కొనసాగుతున్న రాజీనామాల పర్వం

 దీంతో భుక్యా రాందాస్ గతంలోనే కోర్టును ఆశ్రయించాడు. కోర్టు స్టే ఇవ్వడంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ ఆగింది. ఆఫీసర్లు ఖాళీ చేయాలని మరోసారి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అక్కడికి వెళ్లిన ఆర్ఐ తిరుపతిరావు, ఎస్సై గణేశ్​ఎదుట భూక్యా రాందాస్, కొందరు మహిళలు పురుగుమందుల డబ్బాలతో వచ్చి బలవంతంగా ఖాళీ చేయిస్తే చనిపోతామంటూ ఆఫీసర్ల ఎదుటే పురుగుల మందు తాగి పడిపోయాడు. వెంటనే ఆఫీసర్లు, గ్రామస్తుల సహకారంతో అతడిని పీహెచ్​సీకి అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.