పేషెంట్ బంధువులపై డాక్టర్ దాడి.. జనగామ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన

పేషెంట్ బంధువులపై డాక్టర్ దాడి.. జనగామ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన

జనగామ, వెలుగు: పేషెంట్ బంధువులపై డ్యూటీ డాక్టర్ దాడి చేసిన ఘటన జనగామ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. దీనికి సంబంధించిన  వీడియో సోషల్​మీడియాలో వైరల్​ గా మారి కలకలం రేపింది. పేషెంట్ బంధువులు తెలిపిన ప్రకారం.. లింగాల ఘనపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన మహిళ దుర్గి పూలమ్మ వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా శనివారం సాయంత్రం జనగామ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు నీరసంగా ఉండగా స్ట్రెచర్​పై తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో బంధువులే స్ట్రెచర్​పై తీసుకెళ్లారు. పేషెంట్ కండీషన్ సీరియస్ గా ఉందని త్వరగా ట్రీమ్ మెంట్ చేయాలని డ్యూటీ డాక్టర్ స్నేహిత్​ను కోరారు. ఆయన ట్రీట్​మెంట్​చేయకుండా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

డాక్టర్ స్నేహిత్తో క్షమాపణ చెప్పించేందుకు ప్రయత్నించగా పేషెంట్ బంధువులు వినకపోగా.. ఆస్పత్రి ముందు నిరసనకు దిగారు. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి దిగడం ఎంతవరకు సమంజసమని బాధితులు ప్రశ్నించారు. సమాచారం అందడంతో జనగామ టౌన్​ సీఐ దామోదర్​ రెడ్డి, ఎస్ఐలు రాజేశ్​, చెన్నకేశవులు ఆస్పత్రికి వెళ్లారు. పేషెంట్ బంధువులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప జేశారు. ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజలింగంను వివరణ కోరగా,  విచారణ చేసి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సీపీఎం నేత జోగు ప్రకాష్​ చెప్పారు.