క‌రోనా పేషెంట్ల‌కు ట్రీట్మెంట్: కుటుంబంపై ప్రేమ‌తో కారునే ఇళ్లుగా మార్చి..

క‌రోనా పేషెంట్ల‌కు ట్రీట్మెంట్: కుటుంబంపై ప్రేమ‌తో కారునే ఇళ్లుగా మార్చి..

ప్ర‌పంచం మొత్తాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిపై డాక్ట‌ర్లు, న‌ర్సులు ముందు వ‌రుస‌లో నిల‌బ‌డి పోరాడుతున్నారు. త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా వైర‌స్ బారిన‌ప‌డిన పేషెంట్ల‌ను కాపాడ‌డానికి రాత్రిబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. కంటికి క‌నిపించ‌కుండా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి అంటుకున్న క‌నిపించ‌ని శ‌త్రువుతో యుద్ధం చేస్తున్న ఈ వారియ‌ర్ల కుటుంబ‌స‌భ్యుల‌కు ఎక్క‌డ త‌మ ద్వారానే వైర‌స్ సోకుతుందోన‌న్న భ‌యంతో వాళ్లు ప‌డుతున్న క‌ష్టం చూస్తే సామాన్యుల‌కు క‌ళ్లు చ‌మ‌రుస్తాయేమో. డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత భార్య/భ‌ర్త‌, పిల్ల‌ల‌తో సంతోషంగా గ‌డ‌ప‌లేక‌పోతున్నారు. వాకిట్లోకి రాగానే త‌మ పిల్ల‌లు హ‌త్తుకునేందుకు వ‌చ్చినా ద‌గ్గ‌ర‌కు తీసుకునేందుకు ధైర్యం చేయ‌లేక భావోద్వేగానికి లోన‌వుతున్నారు. మ‌రికొంద‌రైతే ఇంటికి కూడా వెళ్ల‌కుండా ఆస్ప‌త్రుల్లోనే ఉండిపోతున్నారు.

ఇంటికి వెళ్ల‌కుండా.. పార్కింగ్ లోనే

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్ లోని జేపీ హాస్పిట‌ల్ లో క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స అందిస్తున్న ఇలాంటి ఓ వారియ‌ర్ డాక్ట‌ర్ స‌చిన్ నాయ‌క్. వైర‌స్ ను ఎదుర్కొంటున్న ఫ్రంట్ లైన‌ర్ గా త‌నకు ఆ మ‌హ‌మ్మారి సోకే ప్ర‌మాదం ఎక్కువ‌. పొర‌బాటున అలా జ‌రిగితే ఆ వైర‌స్ త‌న భార్య, బిడ్డ‌ల‌కు అంటుకోకూడ‌ద‌ని డ్యూటీ పూర్తి చేసుకున్న త‌ర్వాత ఇంటికి కూడా వెళ్ల‌డం లేదు. త‌న‌ కారులో వెనుక సీటును తీసేసి.. బెడ్ వేసి దానినే ఇల్లుగా మార్చుకుని అందులో ఉంటున్నారు డాక్ట‌ర్ స‌చిన్. త‌న ప‌ని ముగించుకున్న త‌ర్వాత హాస్పిట‌ల్ పార్కింగ్ లోనే కారును పెట్టేసి.. దానిలోనే నివ‌సిస్తున్నారు.

పాజిటివ్ కేసుల పెర‌గ‌డంతో..

వారం రోజుల‌గా కారులోనే ఉంటున్నామ‌ని, భార్య‌, బిడ్డ‌ను మిస్ అవుతున్న ఫీలింగ్ రాకుండా వారిలో వీడియో కాల్స మాట్లాడుతున్నాన‌ని తెలిపారు డాక్ట‌ర్ స‌చిన్. భోపాల్ లో క‌రోనా కేసులు స్టార్ట్ అయిన కొత్త‌లో తాను ఏమాత్రం భ‌య‌ప‌డ‌లేద‌ని, అయితే కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండ‌డంతో తాను ఇలా కారులోనే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పారు.

సెల్యూట్ చేసిన సీఎం..

డాక్ట‌ర్ స‌చిన్ నాయ‌క్ కారులో ఉంటున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇది మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ దృషికి వెళ్ల‌డంతో ఆయ‌న ఆ డాక్ట‌ర్ ను ప్ర‌శంసించారు. “స‌చిన్ జీ మీ పోరాట స్ఫూర్తికి సెల్యూట్. ఇలాంటి వారియ‌ర్స్ కు నాతో పాటు మొత్తం మ‌ధ్య‌ప్ర‌దేశ్ అంతా రుణ‌ప‌డి ఉంటుంది. మ‌న‌మంతా ఇదే స్ఫూర్తితో పోరాడితే క‌రోనా మ‌హ‌మ్మారిపై చేస్తున్న యుద్ధంలో త్వ‌ర‌లోనే విజ‌యం సాధిస్తాం” అని ట్వీట్ చేశారు శివ‌రాజ్ సింగ్ చౌహాన్.