పీపీఈ కిట్లు ఇస్తలేరు: రాష్ట్రంలో డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ ఆవేదన

పీపీఈ కిట్లు ఇస్తలేరు: రాష్ట్రంలో డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ ఆవేదన

హాస్పిటల్‌లోతిరగాలన్నా, కొలీగ్స్‌తోమాట్లాడాలన్నా భయమే
ఫ్యామిలీ మెంబర్లకు వైరస్ సోకుతుందేమోనని ఆందోళన
మాస్కులు కూడా మేమే కొనుక్కుంటున్నం..
రాష్ట్రంలో డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ ఆవేదన..
హైదరాబాద్, వెలుగు:‘‘మా హాస్పిటల్లో రోజూ వేలాది మంది పేషెంట్లు , అటెండెంట్ల రష్ ఉంటది. ఎవరికి వైరస్‌ అటాక్‌ అయిందో చెప్పలేం. ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలంటే మేం సేఫ్‌గా ఉండాలి కదా? హాస్పిటల్‌‌లో సరిపడా పీపీఈ కిట్స్‌ లేవు. కనీసం మాస్కులు కూడా ఇస్తలేరు. మేమే ఎన్‌ 95 మాస్కులు కొనుక్కొని తెచ్చుకుంటున్నం. నీళ్లు తాగేందుకు మాస్కులు తీయాలంటే కూడా భయమేస్తున్నది’’ ఇదీ హైదరాబాద్ సుల్తాన్‌ బజార్‌ హాస్పిటల్ లోని ఓ డాక్టర్ ఆవేదన. ‘‘భయం భయంగా ఉద్యోగం చేయాల్సివస్తోంది. వంద ఎన్‌ 95 మాస్కులు ఇవ్వాలని అడిగితే పది మాత్రమే ఇచ్చారు. మేం150 మంది వరకు స్టాఫ్‌ఉంటం. అవేం సరిపోతయ్?”ఇదీ కోఠి హాస్పిటల్‌‌లోని ఓ స్టాఫ్ నర్స్ ప్రశ్న. .. ఇలా రాష్ట్రంలో కరోనా ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ డేంజ‌ర్ జోన్ లో డ్యూటీ చేస్తున్నారు. తమకు సరిపడా పీపీఈ కిట్లు ఇస్తలేరని, మాస్కులు కూడా తామే బయట కొనుక్కొని తెచ్చుకోవాల్సి వస్తోందని డాక్టర్లు, హెల్ స్త్టాఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడి నుంచి ఎలా కరోనా అటాక్ అవుతుందోనన్న భయం వేస్తోందని అంటున్నారు. ప్రభుత్వం పట్టించు కోవడం లేదని, తమ రక్షణకు అవసరమైన ఎక్విప్మెంట్స్ అందజేయడంలేదని గోడు వెళ్ల‌ బోసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది డాక్టర్లు, ఇతర
సిబ్బంది కరోనా బారిన పడ్డారు. కొన్ని హాస్పిటళ్ల‌లో వైరస్‌ భయానికి చాలా డిపార్ట్‌మెంట్లనే క్లోజ్‌ చేసిన పరిస్థితి. ఈ మధ్య కేసుల సంఖ్య భారీగా పెరగడంతో రిస్క్‌ ఎక్కువైంది. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటిదాకా 272 వరకు గవర్నమెంట్‌ డాక్టర్లు, ఇతర స్టాఫ్ కరోనా బారిన పడితే, ప్రైవేటులో మరో 50 మంది వరకు ఉన్నారు. పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులు, ఇతర మెటీరియల్‌ సిద్ధం గా ఉందని ఆఫీసర్లు చెబుతున్నా.. ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి వేరుగా ఉంది. ఎక్కడా పీపీఈ కిట్లు, మాస్కులు సరిపడా లేవు. సగం స్టాఫ్ కు కూడా సేఫ్టీ కిట్లు అందడంలేదని డాక్టర్లు, నర్సులు చెబుతున్నారు. తమ వాళ్ల‌కు కరోనా సోకుతుందేమోనని భయంగా ఉందని, జాబ్ మానేయమని ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారని అంటున్నారు.

సేఫ్టీ కిట్లు లేక ఇబ్బందులు

ఉస్మానియా హాస్పిటల్‌లో 973 మంది డాక్టర్లు, 300 మంది స్టాఫ్‌ నర్సులు అంతా కలుపుకొని 2,500 మంది పని చేస్తుంటారు. గాంధీలో అన్ని రకాల డాక్టర్లు కలుపుకుంటే వెయ్యి మంది ఉంటారు. ఇతర సిబ్బంది మరో 2 వేలు. నిమ్స్‌లో నాలుగున్నర వేల
మంది సిబ్బంది పని చేస్తారు. ఇందులో డాకర్ట్ల సంఖ్య దాదాపు వెయ్యి. ఇలాసిటీలోని దాదాపు అన్నిటీచింగ్ హాస్పిటళ్ల‌లో వేలాది మంది నిత్యం పని చేస్తారు. అయితే ఈ సంఖ్యకు ఎన్నో రెట్లుఎక్కువగా పేషెంట్లు వస్తుంటారు. నిత్యం వేలాది మంది ఓపీకి వస్తుంటారు. కనీస జాగ్రత్తలు తీసుకుందామంటే తగిన సేఫ్టీ కిట్లులేక ఇబ్బందులు పడుతున్నామని మెడికల్ ‌స్టాఫ్ ‌చెబుతున్నారు. పేషెంట్ల సంఖ్యకు తగినంత మంది మెడికల్ స్టాఫ్ లేరు. పేట్లబూర్జు మెటర్నిటీ హాస్పిటల్‌లో 60, 70 మంది పేషెంట్స్ కి ఒక్కరే నర్స్ ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వంద అడిగితే పదే ఇచ్చారు

కింగ్ కోఠి హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నా. నా 23 ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి పరిస్థితి చూడలేదు. భయం భయంగానే
ఉద్యోగం చేస్తున్నాం. పేషెంట్స్ కంటే వారితో వచ్చే అటెండర్స్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్ అవుతోంది. పేషెంట్స్ లో ఎవరికైనా సింటమ్స్
ఉంటే వేరే డిపార్ట్ మెంట్ కి రిఫర్ చేస్తాం. కానీ ఆలోపే మాకు వైరస్ సోకొచ్చు. ఇప్పటిదాకా ఒకసారే మాకు కరోనా టెస్ట్ చేశారు. వారం డ్యూటీ చేసి వారం ఇంట్లో ఉంటున్నాం. స్టాఫ్ తక్కువగా ఉందని మొన్నే 50 మంది అవుట్ సోర్సింగ్ నర్స్ లను రిక్రూట్ చేశారు. అయినా సరిపోవడం లేదు. 80 మంది పేషెంట్స్ ని ఒక నర్స్ చూసుకోవాలి. మాకు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. 100 ఎన్95 మాస్క్ లు కావాలని అడిగితే 10 ఇచ్చారు. వాటిని అందరం ఎలా పంచుకోవాలో అర్థం కాక నేనే క్లాత్ తో మాస్కు కుట్టించుకుని వాడుతున్నా. – స్టాఫ్ నర్స్, కింగ్ కోఠి ఆసుపత్రి

ఇంటికి పోవాలంటేనే భయమైతంది

‘‘ఇచ్చే కొద్దిపాటి జీతానికి ప్రాణాలు పణంగా పెట్టాలా అని నా కొలిగ్స్ లో ఇద్దరు అమ్మాయిలు ఉద్యోగం మానేయాలని డిసైడ్‌
అయ్యారు. కొందరం తప్పని సరి పరిస్థితుల్లో డ్యూటీ చేస్తున్నాం . కానీ ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉంది. మార్నింగ్, ఈవినింగ్ షిఫ్ట్ లు చేస్తున్నా. హాస్పిటల్స్ లో సేఫ్టీ కిట్స్ లేవు. అన్నీ మేమే తెచ్చుకుంటున్నాం. – స్టాఫ్ నర్స్, పేట్లబుర్జు హాస్పిటల్

మా పరిస్థితి దారుణంగా ఉంది..

గైనిక్ విభాగంలో పని చేస్తున్నా. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్ని కేసులు వస్తే అన్ని చూడాలి. మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కూర్చునేందుకు కూడా సరైన సదుపాయం లేదు. ఒకరికొకరం ఆనుకొని కూర్చుంటున్నాం. హాస్పిటల్ లో తినాలన్నా, చివరికి మంచి నీళ్లు తాగాలన్నా భయంగా ఉంది. మాస్క్ అసలు తీయడం లేదు. మేం కొనుక్కున్న మాస్క్లే యూజ్ చేస్తున్నాం. పీపీఈ కిట్స్ కూడా లేవు. 4 రోజులు డ్యూటీ.. 4 రోజులు ఐసోలేషన్ లో ఉంటున్నాం. మా స్టాఫ్ లో ఒకరి కుటుంబంలో అందరికీ వైరస్ సోకింది. అప్పటి నుంచి మరీ ఆందోళనగా ఉంటోంది. – డ్యూటీ డాక్టర్, సుల్తాన్ బజార్ హాస్పిటల్

వైరస్ బారిన స్టాఫ్
హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్, కింగ్ కోఠి, పేట్లబుర్జు వంటి హాస్పిటల్స్ లో డాక్టర్స్ కు, అసిస్టెంట్లకు, నర్సులకు కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో మిగతా స్టాఫ్ కూడా డ్యూటీకి వచ్చేందుకు భయపడుతున్నారు. తమతో పనిచేసే వారికి కరోనా వచ్చింది కాబట్టి తమకు కూడా టెస్ట్ లు చేయాలని కోరుతున్నారు. అయినా టెస్టులు చేయడం లేదని చెబుతున్నారు. టెస్టులు చేయాలని నాలుగైదు సార్లు అడిగితే తప్ప పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారు. జలుబు, జ్వరం వంటివి ఉంటే 15 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండి తర్వాత డ్యూటీకి వస్తున్నామని చెబుతున్నారు. రోగికి క్లోజ్ ‌కాంటాక్ట్‌‌లోకి వెళ్లి..ప్రాణాలను పణంగా పెట్టి తాము సేవలందిస్తున్నా సర్కారు తగిన సేఫ్టీమెటీరియల్‌‌ అందించడం లేదని ఆవేదన చెందుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..