ఈ స్టెతస్కోప్‌‌‌‌ గుండె జబ్బులను గుర్తిస్తది.!

ఈ  స్టెతస్కోప్‌‌‌‌ గుండె జబ్బులను గుర్తిస్తది.!

దాదాపు రెండు వందల ఏండ్ల క్రితం ప్రపంచంలో మొదటి స్టెతస్కోప్‌‌‌‌ని కనిపెట్టారు. అప్పటినుంచి చాలాసార్లు డిజైన్‌‌‌‌లో చిన్న చిన్న మార్పులు చేశారు. కానీ.. ఇప్పుడు ఈ క్లాసిక్ టూల్‌‌‌‌కి ఏఐ టెక్నాలజీని జోడించి కొత్త వెర్షన్‌‌‌‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు సైంటిస్ట్‌‌‌‌లు. ఇది సాధారణ స్టెతస్కోప్‌‌‌‌తో పోలిస్తే మూడు రకాల గుండె సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించగలదని బ్రిటన్‌‌‌‌ పరిశోధకులు చెప్తున్నారు. హార్ట్ ఫెయిల్యూర్(గుండె వైఫల్యం), ఆట్రియల్‌‌‌‌ ఫిబ్రిలేషన్‌‌‌‌ (గుండె  క్రమరహితంగా అంటే చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా కొట్టుకోవడం), హార్ట్ వాల్వ్ డిసీజ్ (గుండె కవాట వ్యాధి) లాంటివాటిని డాక్టర్ల కంటే ముందుగానే ఇది గుర్తించగలుతుంది. 

సాధారణ స్టెతస్కోప్‌‌‌‌తో మనిషి చెవి శరీరంలోని శబ్దాలను మాత్రమే వినగలదు. ఈ కొత్త ఏఐ బేస్డ్‌‌‌‌ స్టెతస్కోప్‌‌‌‌ మాత్రం చాలా అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌గా పనిచేస్తుంది. మైక్రోఫోన్, సెన్సర్లతో పనిచేసే ఈ పరికరం  చూడడానికి ప్లేయింగ్ కార్డ్‌‌‌‌లా ఉంటుంది. దీన్ని రోగి ఛాతిపై పెట్టినప్పుడు బ్లడ్‌‌‌‌ సర్క్యులేషన్‌‌‌‌ సౌండ్స్‌‌‌‌, విద్యుత్ సంకేతాలను (ఈసీజీ) రికార్డ్ చేస్తుంది. మనిషి గుర్తించలేని సూక్ష్మమైన తేడాలను గుర్తించి ఆ సమాచారాన్ని క్లౌడ్‌‌‌‌కు పంపుతుంది. క్లౌడ్‌‌‌‌లో పదివేల మంది రోగుల నుంచి సేకరించిన డేటా ఉంటుంది. ట్రైనింగ్‌‌‌‌ తీసుకున్న శక్తివంతమైన ఏఐ అల్గోరిథంలు ఆ డేటాతో పోల్చి విశ్లేషిస్తాయి. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్‌‌‌‌ని నేరుగా స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ యాప్‌‌‌‌కు పంపుతుంది. రోగికి గుండె సమస్యలు తలెత్తే ప్రమాదం ఎంతవరకు ఉందనేది ముందే గుర్తించగలదు. 

►ALSO READ | ఈ సండే స్పెషల్.. వంకాయతో వెరైటీ వంటకాలు..ఒక్కసారి ట్రై చెయ్యండి

అమెరికాకు చెందిన ఎకో హెల్త్ కంపెనీ ఈ ఏఐ స్టెతస్కోప్‌‌‌‌ను తయారుచేసింది. దీన్ని ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఇంపీరియల్ కాలేజ్ హెల్త్‌‌‌‌కేర్ ఎన్‌‌‌‌హెచ్ఎస్ ట్రస్ట్  టెస్ట్ చేసింది. దీంతో 96 క్లినిక్‌‌‌‌ల్లో12 వేల మందికి పైగా రోగులను పరీక్షించారు. ఆ రిజల్ట్‌‌‌‌ని సాధారణంగా డాక్టర్లు పరిశీలిస్తే వచ్చిన రిజల్ట్‌‌‌‌తో పోల్చారు. హార్ట్ ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌ ఉన్న రోగుల్లో 12 నెలల్లోపు దానిని గుర్తించే అవకాశం 2.3 రెట్లు పెరిగింది. అంతేకాదు.. డాక్టర్ల కంటే ఆట్రియల్‌‌‌‌ ఫిబ్రిలేషన్‌‌‌‌ను 3.5 రెట్లు, హార్ట్ వాల్వ్ డిసీజ్ 1.9 రెట్లు కచ్చితంగా గుర్తిస్తోందని రీసెర్చర్లు కనుగొన్నారు.