- ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రావు వర్సెస్ వన్ హాస్పిటల్ డాక్టర్ మహేశ్ రెడ్డి
- హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్(హెచ్‌ఏఎఫ్) ఏర్పాటుతో రాజుకున్న వివాదం
- రెండు వర్గాలుగా విడిపోయిన డాక్టర్లు
- మల్యాల పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై మరొకరు కేసులు
- తాజాగా బీఎన్‌రావు మీద కలెక్టర్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో ఇద్దరు ప్రైవేట్ డాక్టర్ల మధ్య వార్ చిలికిచిలికి గాలివానగా మారి కేసుల వరకు వెళ్లింది. ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు, వన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మహేశ్‌రెడ్డి మధ్య మూడు నెలలుగా నెలకొన్న వివాదం.. తాజాగా తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకోవడం, కేసులు నమోదు కావడం డాక్టర్లలో చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ హాస్పిటల్స్‌పై దాడుల నిరోధానికి ఐఎంఏతోపాటు తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోం అసోసియేషన్(తానా)కు ప్రత్యామ్నాయంగా కొందరు హాస్పిటల్స్ ఓనర్లు హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్(హెచ్‌ఏఎఫ్) ను ఏర్పాటు చేయడమేగా వివాదానికి కారణమని తెలిసింది.
హెచ్‌ఏఎఫ్ ఏర్పాటుతో మొదలైన వివాదం
ఉత్తర తెలంగాణ పరిధిలో అత్యధిక ప్రైవేట్ హాస్పిటల్స్‌తో కరీంనగర్ లో మెడికల్ హబ్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. అయితే పుట్టగొడుగుల్లా వెలిసిన ఈ హాస్పిటళ్లలో కొన్నిసార్లు డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పేషెంట్లు చనిపోయిన సందర్భాల్లో మృతుల బంధువులు ఆందోళన చేస్తున్నారు. కోపంతో కొన్నిసార్లు హాస్పిటల్స్ మీద, డాక్టర్లు, సిబ్బంది మీద దాడులకు దిగుతున్నారు. ఇలాంటి సమయంలో సదరు డాక్టర్ల తరఫున ఐఎంఏ, తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోం అసోసియేషన్(తానా) రంగంలోకి దిగి సమస్య పరిష్కారానికి కృషి చేసేవి.
డాక్టర్ల మీద దాడులు జరిగితే వారి తరఫున కొట్లాడేవి. చాలా ఏళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. కాగా ఇటీవల కొన్ని సందర్భాల్లో ఐఎంఏ, తానా సరైన తీరులో స్పందించడం లేదనే కారణంతో కొందరు ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులు ప్రైవేట్ హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్(హెచ్‌ఏఎఫ్) పేరిట ఓ కొత్త సంఘాన్ని స్థాపించారు. ఈ ఫోర్స్ ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం సీపీ దృష్టికి వెళ్లడంతో ఆయన హెచ్‌ఏఎఫ్ బాధ్యులను పిలిచి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఫోర్స్ ఏర్పాటులో వన్ హాస్పిటల్ ఎండీ మహేశ్‌రెడ్డితోపాటు మరికొందరు హాస్పిటల్స్ నిర్వాహకులు కీలకంగా పనిచేయగా.. దీనికి వ్యతిరేకంగా డాక్టర్ బీఎన్ రావు క్యాంపెయిన్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మల్యాల స్టేషన్‌లో కేసులు..
ఇటీవల కరీంనగర్ వన్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తన నియోజకవర్గ కార్యకర్తను పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్ హాస్పిటల్ లిఫ్ట్‌లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హాస్పిటల్ మెయింటనెన్స్ సరిగ్గా లేదని, క్వాలిఫైడ్ డాక్టర్లు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంక్వైరీ చేయాలని అక్కడికి వచ్చిన డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ఆ తర్వాత ఈ వన్ హాస్పిటల్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం జరిగింది.
ఈ ప్రచారం వెనక డాక్టర్ బీఎన్‌రావు ఉన్నారని, ఆయన నంబర్ నుంచే డాక్టర్లకు, డాక్టర్ల గ్రూపులకు మెస్సేజ్‌లు ఫార్వర్డ్ అయ్యాయని మహేశ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే ఈ నెల 6న మల్యాల మండలం రామన్నపేటకు డాక్టర్ బీఎన్ రావు వెళ్లగా ఆయనను మహేశ్ రెడ్డి అనుచరులు ప్రశ్నించారు. అంతేగాక తమను బీఎన్ రావు కులం పేరుతో దూషించారని మల్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దర్యాప్తులో ఉంది.
మరుసటి రోజే బీఎన్ రావు కూడా మహేశ్ రెడ్డి అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ నెల 13న కేసు నమోదు చేశారు. డాక్టర్ బీఎన్ రావు రుమటాలజిస్టుగా చెప్పుకుంటున్నారని, ఆయనకు అందుకు సంబంధించిన డిగ్రీ లేదని తాజాగా మహేశ్ రెడ్డి డీఎంహెచ్‌వోకు, కలెక్టర్‌కు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ఇరువురు డాక్టర్ల మధ్య నెలకొన్న వివాదం వైద్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
