- నొప్పితో తీవ్ర అవస్థలు పడ్డ మహిళ
- 2012లో ఆపరేషన్ చేసి కత్తెర లోపలే మరిచిన డాక్టర్లు
- సిక్కింలోని గాంగ్ టక్ఆస్పత్రిలో ఘటన
గాంగ్ టక్:కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లిన మహిళకు డాక్టర్లు అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు..ఆ తర్వాత నొప్పి తగ్గాల్సింది పోయి మరింత ఎక్కువైంది. డాక్టర్లను, మందులను మార్చినా తగ్గలేదు. ఇలా ఒకటి రెండేళ్లు కాదు.. ఏకంగా పదేళ్ల పాటు నరకం చూసిందా మహిళ. ఆపరేషన్ కు ఉపయోగించిన కత్తెర ఆమె పొత్తి కడుపులో ఉండిపోవడమే నొప్పికి కారణమని గుర్తించిన వైద్యులు చివరకు ఆపరేషన్ చేసి తొలగించారు.
సిక్కిం రాజధాని గాంగ్ టక్ లో చోటుచేసుకుందీ ఘటన. కుటుంబ సభ్యులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంగ్ టక్ కు చెందిన ఓ మహిళకు 2012 లో అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. గాంగ్ టక్ లోని సర్ థుటోబ్ నాంగ్యాల్ మెమోరియల్ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేశారు. తిరిగి కుట్లు వేసే సమయంలో ఓ కత్తెరను లోపలే మరిచిపోయారు.
ఆపరేషన్ తర్వాత కూడా కడుపు నొప్పి తగ్గకపోవడంతో బాధితురాలు ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. పేరొందిన వైద్యుల దగ్గరికి వెళ్లినా ఆమె కడుపు నొప్పికి కారణం ఏంటనే విషయం వారు గుర్తించలేకపోయారు. డాక్టర్లను, మందులను మార్చి చూసినా ఫలితం లేకుండా పోయింది. ఈ నెల మొదట్లో బాధితురాలు మరోమారు సర్ థుటోబ్ ఆస్పత్రికి వెళ్లింది.
ఆపరేషన్ తర్వాత నొప్పి మరింత పెరిగిందని చెప్పడంతో డాక్టర్లు ఎక్స్ రే తీసి చూశారు. లోపల కత్తెర ఉన్నట్లు గుర్తించి ఈ నెల 8న ఆపరేషన్ చేసి దానిని తొలగిం చారు. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటోందని డాక్టర్లు వివరించారు. కాగా, బాధితురాలి కడుపులో కత్తి మరిచిపోయిన ఘటనకు సంబంధించి విచారణ జరిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.