డాక్టర్లూ.. మీ రాత మార్చుకోండి!మందుల చీటీలు అర్థమయ్యేలా క్యాపిటల్ లెటర్స్‌‌‌‌లోనే రాయాలి

డాక్టర్లూ.. మీ రాత మార్చుకోండి!మందుల చీటీలు అర్థమయ్యేలా క్యాపిటల్ లెటర్స్‌‌‌‌లోనే రాయాలి
  • మందుల చీటీలు అర్థమయ్యేలా క్యాపిటల్ లెటర్స్‌‌‌‌లోనే రాయాలి
  • మెడికల్ కాలేజీలు, ఇన్​స్టిట్యూషన్లకు ఎన్‌‌‌‌ఎంసీ సీరియస్ ఆర్డర్స్
  • పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పుతో కేంద్రం కీలక నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ‘‘డాక్టర్ రాసిన మందుల చీటీ ఆ దేవుడికి.. మెడికల్ షాపోడికి తప్ప ఎవరికీ అర్థం కాదు..’’అనే నానుడికి ఇక చెక్ పడనున్నది. డాక్టర్ల చేతి రాతపై ఎప్పటి నుంచో ఉన్న జోకులకు, రోగుల పాట్లకు ముగింపు పలుకుతూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సంచలన నిర్ణయం తీసుకున్నది. 

ఇకపై డాక్టర్లు మెడికల్ ప్రిస్క్రిప్షన్లను స్పష్టంగా, చదవడానికి  వీలుగా, సాధ్యమైనంత వరకు క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలని ఆదేశించింది. అంతేకాదు... ఈ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక ప్రత్యేక కమిటీ వేయాలని ఆదేశించింది. ఇటీవల పంజాబ్, హర్యానా హైకోర్టు యోగేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో కీలక తీర్పునిచ్చింది. 

మందుల చీటీలు స్పష్టంగా లేకపోవడంతో రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, స్పష్టమైన ప్రిస్క్రిప్షన్ పొందడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల ప్రాథమిక హక్కు అని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలతో ఎన్‌‌‌‌ఎంసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు (పీజీఎంఈబీ) దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలు, మెడికల్ ఇన్​స్టిట్యూట్లకు సోమవారం సర్క్యులర్ జారీ చేసింది.

పర్యవేక్షణకు సబ్ కమిటీ

డాక్టర్లు రాసే చీటీలను మానిటర్ చేయడానికి ప్రతి హాస్పిటల్, కాలేజీలోని ‘డ్రగ్స్ అండ్ థెరపిటిక్స్ కమిటీ’ (డీటీసీ) కింద ఒక సబ్ -కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఎన్‌‌‌‌ఎంసీ ఆదేశించింది. ఈ కమిటీ హాస్పిటల్ డాక్టర్లు రాసే మందుల చీటీలను రెగ్యులర్‌‌‌‌గా తనిఖీ చేస్తుంది. రూల్స్ ప్రకారం జనరిక్ పేర్లు రాస్తున్నారా? లేదా? రాత అర్థమవుతుందా? అనేది గమనిస్తుంది. 

ఈ వివరాలన్నింటినీ రికార్డు చేసి, ఎన్‌‌‌‌ఎంసీ అడిగినప్పుడు సమర్పిస్తుంది. ఎన్ఎంసీ కేవలం ఆదేశాలతో సరిపెట్టకుండా... సమస్యను మూలాల నుంచి పరిష్కరించేందుకు ప్లాన్ చేసింది. ఇకపై మెడికల్ స్టూడెంట్స్ కు కరిక్యులమ్ లో ‘మెడికల్ ప్రిస్క్రిప్షన్లలో స్పష్టమైన చేతిరాత ఆవశ్యకత’ అనే అంశాన్ని చేర్చాలని నిర్ణయించింది. 

క్యాపిటల్ లెటర్స్ మస్ట్

ప్రస్తుతం డాక్టర్లు మెడికల్ ప్రిస్క్రిప్షన్​ను తమకు ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. డాక్టర్లు ఇలా అర్థం కాకుండా రాయడం రూల్స్​కు విరుద్ధం. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్స్ -2002 ప్రకారం.. ప్రతి డాక్టర్ మందులను జనరిక్ పేర్లతోనే రాయాలి. అది కూడా స్పష్టంగా..చదవడానికి వీలుగా.. సాధ్యమైనంత వరకు క్యాపిటల్ లెటర్స్​లో రాయాలని ఎన్‌‌‌‌ఎంసీ తెలిపింది.