వరంగల్‍ ఎంజీఎంలో నిరసనల హోరు

 వరంగల్‍ ఎంజీఎంలో నిరసనల హోరు

వరంగల్‍, కాశిబుగ్గ, వెలుగు: వానాకాలం నేపథ్యంలో సీజనల్‍ వ్యాధులు పెరుగుతుండగా.. ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న వరంగల్‍ ఎంజీఎంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కొద్దిరోజులుగా పేషెంట్ల సంఖ్య పెరుగుతుండగా.. శానిటేషన్‍, సెక్యూరిటీ, డాక్టర్లు తమ సమస్యలపై నిరసనలకు దిగుతున్నారు. ఇదిలా ఉంటే ఓపీ డబుల్​అవుతున్న తరుణంలో డాక్టర్లు, సిబ్బంది మానవత దృక్పథంతో డ్యూటీల్లో చేరాలంటూ ఏకంగా హాస్పిటల్‍ సూపరింటెండెంట్‍ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఎస్ఆర్​ డాక్టర్ల ఆందోళన..

నెలల తరబడి తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎంజీఎం సీనియర్‍ రెసిడెన్సీ డాక్టర్లు మూడ్రోజులుగా నిరసన తెలుపుతున్నారు. అలాగే సీనియర్‍ రెసిడెన్సీలతో ప్రభుత్వం కుదుర్చుకున్న కాంట్రాక్ట్ జూన్‍ 30తేదీతో ముగిసినట్లు తెలిపారు. ఆ తర్వాత రెన్యూవల్‍ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో డ్యూటీలకు రాలేమని తేల్చిచెప్పారు. ప్రభుత్వం తమ రెన్యూవల్‍ అంశమై ఏదో ఒక ప్రకటన చేయాలని కోరారు. తమ సమస్యలను క్లియర్‍ చేయకుంటే ఎమర్జెన్సీ సర్వీసులు సైతం బహిష్కరిస్తామని హెచ్చరించారు. 

జీతాల కోసం కార్మికులు..

ఎంజీఎంలోని వందలాది మంది శానిటేషన్‍, సెక్యూరిటీ, పేషెంట్‍ కేర్‍ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఈ నెల 3న ఆందోళనకు దిగారు. డ్యూటీని బహిష్కరించారు.3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఆఫీసర్లు కొత్త ఏజెన్సీ టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాగా, రెండ్రోజులగా సిబ్బంది డ్యూటీకి రాకపోవడంతో ఎంజీఎంలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి.

బైఠాయించిన సూపరింటెండెంట్‍.. 

హాస్పిటల్లో ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న శానిటేషన్‍, సెక్యూరిటీ, పేషేంట్‍ కేర్‍ సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలంటూ ధర్నాలో ఉన్న సిబ్బందిని ఎంజీఎం సూపరింటెండెంట్‍ డాక్టర్‍ చంద్రశేఖర్‍ సోమవారం కోరారు. ఎమర్జెన్సీ టైంలో పేషెంట్లకు సేవలు ఆపడం సరికాదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. సిబ్బంది జీతాల అంశాన్ని హెల్త్ మినిస్టర్‍, ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లి రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించేలా తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అయినా వారు వినకపోవడంతో ఆయనే రోడ్డుపై కూర్చోని నిరసన తెలిపారు. దీంతో కొందరు విధుల్లో చేరారు. మిగిలిన వాళ్లు చేరకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.