పావురాలతో పొంచి ఉన్న ముప్పు..?

పావురాలతో  పొంచి ఉన్న ముప్పు..?

ఊళ్ళల్లో కాకులు, చిలుకలు, పిచ్చుకలు ఎక్కువగా కనిపిస్తాయి. హైదరాబాద్ సిటీలో అయితే ఎక్కడ చూసినా గుంపులు, గుంపులుగా పావురాలు కనిపిస్తున్నాయి. భాగ్యనగరం పావురాలకు అడ్డాగా మారింది. చాలామంది దాతలు వీటికి గింజలను ఆహారంగా వేస్తూ.. వాటి ఆకలి తీరుస్తున్నారు. అయితే పావురాల మల విసర్జనతో వస్తున్న వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు డాక్టర్లు. 

హైదరాబాద్ లో పావురాలు ఎక్కువగా అమీర్ పేట్, KBR పార్క్, బంజారా భవన్, నాంపల్లి రైల్వే స్టేషన్, గోషామహల్, పురానా పూల్, ట్యాంక్ బండ్, మక్కా మసీద్, కోఠి, సికింద్రాబాద్, ఇందిరా పార్క్ ఏరియాల్లో కనిపిస్తుంటాయి. చెట్ల కొమ్మలు, కరెంటు తీగలు, అపార్ట్ మెంట్ విండోస్, ఏసీల ఔట్ లెట్స్, మెట్రో రైల్ పిల్లర్లు, పురాతన కట్టడాలు, టూరిస్ట్ ప్రాంతాల దగ్గర ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పావురాలకు చాలామంది పక్షి ప్రేమికులు ప్రతి రోజూ దానా గింజలు వేస్తుంటారు. జంతువులు, పక్షులు అంటే ఇష్టం ఉన్నా వాటి నుంచి వచ్చే వ్యాధులపైనా అవగాహన ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

పావురాల రెట్టలతో ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ వ్యాధులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నటి మీనా భర్త.. పావురాల రెట్టతోనే చనిపోయినట్టు వార్తలొచ్చాయి. అందుకే ఎవరైనా పావురాలకు గింజలు వేసేటప్పుడు ముందు జాగ్రత్తగా మాస్కులు పెట్టుకోవాలని పక్షి ప్రేమికులు సూచిస్తున్నారు. పావురాల మలవిసర్జనతో లంగ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అపార్ట్ మెంట్లల్లో,  ఇళ్ళల్లో పావురాలను పోషించడం మంచిది కాదంటున్నారు.  


ఇప్పటికే నగరంలో చాలామంది కాలుష్యంతో పాటు కోవిడ్ వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. పావురాలతో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. పక్షి ప్రియులు పావురాలకు గింజలు వేయాలనుకుంటే జూ పార్కులో లేదా ఓపెన్ ప్లేస్ లో దానా వేయాలి. జనం రద్దీగా ఉన్న ఏరియాల్లో గింజలు వేస్తే... వాటి రెట్టల నుంచి ఏర్పడే చిన్న అణువులు మనిషి ఊపిరితిత్తుల్లోకి వెళతాయి. దాంతో ఇంటర్ సెషల్ లంగ్స్ డిసీజెస్ వస్తామని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే పావురాలు చేసే ధ్వని వల్ల కూడా కొందరు ఇబ్బందులు పడుతుంటారు. అందువల్ల వీటిని సిటీ శివారు ప్రాంతాలకు తరలించాలని కొందరు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. 

పావురాలను చూసి చాలా మంది ముచ్చటపడుతుంటారు. కానీ, వాటి నుంచి మనుషులకు అనేక ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల రెట్ట నుంచి రెప్పల వరకు శరీరం మొత్తం రకరకాల వైరస్‌లకు ఆవాసంగా ఉంటుందని చెబుతున్నారు. వీటి నుంచి పదుల సంఖ్యలో వైరస్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల రెట్టల్లో ‘హిస్టాప్లాస్మా’ అనే ఫంగస్ ఉంటుందని.. దీని వల్ల ‘హిస్టాప్లాస్మోసిస్’ అనే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వస్తుందని చెబుతున్నారు. గబ్బిలాల రెట్టల్లోనూ ఈ ఫంగస్ ఉంటుందని వెల్లడిస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలకు వెంటనే సోకే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. పావురాల కారణంగా చాలా మంది వారికి తెలియకుండానే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు.