
- బీసీలకు రిజర్వేషన్లు పెంచేవరకు స్థానిక ఎన్నికలు పెట్టొద్దు
బషీర్‌బాగ్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాళ్లు విసురుతున్న బీఆర్ఎస్ పార్టీ నేతలకు బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించే ధైర్యం ఉందా అని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేవరకు స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రిజర్వేషన్ల సమస్యను పక్కదారి పట్టించవద్దని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేశారు.
బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశ్ అధ్యక్షతన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శనివారం14 బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్‌చేసిన నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ పార్టీలు ఒత్తిడి పెంచాలన్నారు. దమ్ముంటే ఎన్నికలు జరపాలి.. వెంటనే ఎన్నికలకు వెళ్లాలి.. అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న సవాళ్లు ఆ పార్టీ స్వప్రయోజనం కోసమేనాన్నరు.
ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, నిపుణులతో చర్చించాలన్నారు. రిజర్వేషన్లు పెంపుపై జీఓ రిలీజ్చేసి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. సమాచారశాఖ కమినర్పోస్టుల్లో ఒక్క బీసీని కూడా నియమించరా అని ప్రశ్నించారు. మిగిలిన మూడు కమిషనర్పోస్టుల్లోనైనా బీసీలను నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.