ప్రతి పనిని ధ్యానంలా చేస్త : సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

ప్రతి పనిని ధ్యానంలా చేస్త : సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

సికింద్రాబాద్, వెలుగు:  ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని.. ప్రతి పనిని ధ్యానంగా చేయడం అలవర్చుకోవాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. ఇది గౌతమ బుద్ధుడు చేసిన బోధనల్లో ఒకటని తెలిపారు. తనకెంతో ఇష్టమైన లైన్ అని, చదివితే రెండు లైన్లే అనిపించినా దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉందని అన్నారు. తాను కూడా ఏ పనైనా ఎంతో ధ్యానంలా చేస్తానని చెప్పారు. బుద్ధుని బోధనల నుంచే నేర్చుకున్నట్టు తెలిపారు. ఆయన సందేశాల నుంచి ఎంతో స్ఫూర్తి పొందినట్టు వివరించారు. 

బుద్ధ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్​లోని మహాబోధి బుద్ధ విహార్​లో నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. ‘‘బుద్ధుడి బోధనలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. నేటికీ అవి ఆచరణీయమే.. సమాజంలో అశాంతి, అసూయలు చాలా పెరిగిపోయాయి. వాటిని అధిగమించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనలను ప్రతి ఒక్కరిలో పెంచాలి. దీని కోసం గౌతమ బుద్ధుడి బోధనలను అందరికి పంచాలి. ఎంపీగా ఉన్నప్పుడు బుద్ధ విహార్​ను సందర్శించాలని చాలా సార్లు అనుకున్న. కానీ.. రాలేకపోయాను. ఇప్పుడు సీఎం హోదాలో బుద్ధ విహార్​ను సందర్శించడం సంతోషంగా ఉంది. ఓ గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలుగుతున్నది’’అని రేవంత్ అన్నారు. 

చాలా మందికి ప్రశాంతత కరువైంది

శాంతి సాధన, స్థాపన కోసం, సమాజానికి మేలు జరగాలనే ఉద్దేశంతో చిన్న వయసులోనే అన్ని త్యాగాలను చేసిన గొప్ప మహనీయుడు గౌతమ బుద్ధుడని రేవంత్ అన్నారు. ప్రపంచానికి అద్భుతమైన సందేశం ఇచ్చారని తెలిపారు. అన్ని మతాలను కలిపితే బౌద్ధ మతం అనే విధంగా భావిస్తున్నామన్నారు. ‘‘బుద్ధుడి బోధనల్లో తత్వం ఉంది.. ఆలోచింపజేసే మార్గం ఉన్నది.. అర్థం చేసుకుని ప్రపంచానికి పరిజ్ఞానాన్ని అందించే శక్తి ఉన్నది..’’అని రేవంత్ అన్నారు. చాలా మందికి ప్రశాంతత కరువైందని, మనుషుల్లో రకరకాల విద్వేషాలు, క్రోధం, ఆక్రోశం, అసహనం వంటివి పెరుగుతున్నాయని తెలిపారు. 

‘‘రాష్ట్రం, దేశంలో శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి టైమ్​లోనే గౌతమ బుద్ధుడి సందేశాన్ని సమాజంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను. మహాబోధి బుద్ధ విహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది. జాతీయ స్థాయిలో ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా సాయం చేస్తాం. రాష్ట్రంలో బౌద్ధ భిక్షువులకు తగిన గౌరవం ఉంటుంది’’అని రేవంత్ హామీ ఇచ్చారు. ధ్యాన మందిరం కోసం ప్రతిపాదనలు పంపితే.. ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగిశాక స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్ కింద నిధులు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బుద్ధ విహార్ ఆధ్వర్యంలో ఒక స్కూల్ నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు.