కవిత బాటలో రోహిణి.. సోషల్ మీడియాలో తండ్రి ఫొటోలు డిలీట్.. పార్టీకి గుడ్ బై..?

కవిత బాటలో రోహిణి.. సోషల్ మీడియాలో తండ్రి ఫొటోలు డిలీట్.. పార్టీకి గుడ్ బై..?

పాట్నా: ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై సొంత కూతురు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సస్పెన్షన్ వేటు పడటంతో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కవిత రిజైన్ చేశారు. ఈ క్రమంలో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కూడా కవిత బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు తండ్రి స్థాపించిన ఆర్జేడీ పార్టీకి రోహిణి గుడ్ బై చెప్పనున్నట్లు బీహార్ పాలిటిక్స్‎లో ప్రచారం జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆమె వ్యవహార తీరే. రోహిణి ఇటీవల సోషల్ మీడియాలో తన సోదరుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సన్నిహితుడు సంజయ్ యాదవ్‌ను లక్ష్యంగా విమర్శలు గుప్పించింది.

 సంజయ్ యాదవ్‌ను రోహిణి టార్గెట్ చేయడం ఆర్జేడీ పార్టీలో ప్రకంపనలు రేపింది. రోహిణి తీరుతో ఆమెకు సోదరుడు తేజస్వీ యాదవ్‎తో విభేదాలు ఉన్నట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగానే రోహిణి మరో బాంబ్ పేల్చింది. సోషల్ మీడియా వేదికగా మరోసారి తన అసంతృప్తి వ్యక్తం చేసింది. 

సోషల్ మీడియాలో ఆర్జేడీ అగ్ర నాయకులతో సహా మొత్తం 58 మంది రాజకీయ ప్రముఖులను రోహిణి అన్‌ఫాలో చేసింది. రోహిణి అన్ ఫాలో చేసిన వారిలో ఆమె తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, సోదరుడి తేజస్వీ కూడా ఉండటం గమనార్హం. అలాగే.. తండ్రి లాలూ ప్రసాద్, తల్లి రబ్రీ దేవి, సోదరుడు తేజస్వి యాదవ్ సహా తన కుటుంబ సభ్యులు ఫొటోలను కూడా రోహిణి డిలీట్ చేసింది.

 రోహిణి బహిరంగంగానే పార్టీపై తన అసంతృప్తి వ్యక్తం చేస్తోన్నప్పటికీ ఆర్జేడీ నాయకులు మాత్రం ఈ ఇష్యూపై సెలైంట్‎గా ఉంటున్నారు. లాలూ కూతురు కావడంతో ఆచితూచి వ్యవహారిస్తున్నారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రోహిణి తీరు ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీకి తలనొప్పిగా మారింది.