జలుబు చేస్తే.. కరోనాయేనా?

జలుబు చేస్తే.. కరోనాయేనా?

చలికాలంలో జలుబు మామూలే. ఒళ్లునొప్పులు కూడా అంతే!  కానీ, అవి తగ్గిపోతాయిలే అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు జలుబు చేసినా, ఫ్లూ వచ్చినా తేలికగా తీసుకునేలా లేదు. ఎందుకంటే... ఒమిక్రాన్, ఫ్లూ.. వీటన్నింటిలో లక్షణాలు దాదాపు ఒకేలా ఉండడమే అందుకు కారణం. దాంతో కరోనా సోకిందేమోనన్న అనుమానం వస్తోంది చాలామందికి. సీజన్​లో వచ్చే హెల్త్​ ప్రాబ్లమ్స్​ని కరోనా అని పొరబడొద్దు. లక్షణాలను బట్టి కరోనా సోకిందా? లేదా? అనేది తెలుసుకోవాలి అంటున్నారు డాక్టర్లు.

కరోనా కొత్త వేరియెంట్​ ఒమిక్రాన్ ​ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే, అందర్నీ కలవరపెడుతున్న సమస్య ఏంటంటే... ఒమిక్రాన్​ ఇన్ఫెక్షన్ వస్తే ఫలానా లక్షణాలు కనిపిస్తాయని ఇప్పటికీ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒమిక్రాన్​ అనేది మ్యుటెంట్ వేరియెంట్. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్​ అయినా, డెల్టా అయినా, ఇన్​ఫ్లుయెంజా అయినా మొదట్లో లక్షణాలు ఒకేలా ఉంటాయి. కానీ, రెండు మూడు రోజుల్లో లక్షణాల తీవ్రత, మార్పుని బట్టి అది ఏ రకం ఇన్ఫెక్షన్ అనేది కనిపెట్టొచ్చు. ఉదాహరణకు...  ఫ్లూ ఇన్ఫెక్షన్​లో ముక్కు కారడం, ముక్కు పట్టేయడం, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు లూజ్​ మోషన్స్ అవుతాయి కూడా.  అదే కరోనా ఇన్ఫెక్షన్​ అనుకోండి జ్వరం, బాడీపెయిన్స్, శ్వాస తీసుకోవడం కష్టమవడం వంటివి ఇబ్బందిపెడతాయి. 

ఒమిక్రాన్​ లక్షణాలివి

ఒమిక్రాన్​ సోకినవాళ్లకి బాడీపెయిన్స్​ ఎక్కువ ఉంటాయి. అది కూడా ఒక్కసారిగా బాడీపెయిన్స్​ వస్తాయి. తగ్గిపోతాయి. గొంతు మంటగా అనిపిస్తుంది. వాసన, రుచి కోల్పోవడం ఉండదు. లక్షణాల తీవ్రత తక్కువ కనుక చాలామంది తమకు ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్​ సోకిందన్న విషయమే గుర్తించట్లేదు. నాలుగు రోజులకి మించి జలుబు ఉంటే అది ఒమిక్రాన్​ ఇన్ఫెక్షన్ కావొచ్చు. వెంటనే డాక్టర్​ని కలిసి, కరోనా టెస్ట్ చేయించుకోవాలి. కరోనా టెస్ట్​ చేయించుకుంటేనే ఒమిక్రాన్​ సోకిందనే విషయం తెలుస్తుంది. 

ట్రీట్మెంట్​

డెల్టాప్లస్ ఇన్ఫెక్షన్​కు ఇప్పటికే వాడుతున్న ట్రీట్మెంట్.. ​ ఒమిక్రాన్​కు కూడా సరిపోతుంది. ఒమిక్రాన్​ లక్షణాలు ఐదు రోజుల్లో తగ్గిపోతాయి. కాక్​టెయిల్​ ఇంజెక్షన్​ ఒమిక్రాన్​ ఇన్ఫెక్షన్​ని తగ్గించలేదు. తరచుగా జ్వరం వచ్చేవాళ్లకు, రక్తంలో ఆక్సిజన్​ లెవల్స్ తక్కువ ఉన్నవాళ్లకు, ఆగకుండా దగ్గు వచ్చేవాళ్లకి రెమిడిసివిర్​ పనిచేస్తుంది     

వీళ్లు హైరిస్క్​ గ్రూప్

పెద్దవాళ్లు, వ్యాక్సిన్​ వేసుకోనివాళ్లు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవాళ్లలో ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువ. అయితే వ్యాక్సిన్​ తీసుకున్నంత మాత్రాన ఒమిక్రాన్​ ఇన్ఫెక్షన్ రాదని చెప్పలేం. అయితే, వీళ్లకి అడ్వాంటేజ్​ ఏంటంటే... ఇన్ఫెక్షన్ సోకినా  పెద్దగా ఇబ్బంది ఉండదు. లక్షణాలు తక్కువ ఉంటాయి కాబట్టి హాస్పిటల్​కి వెళ్లాల్సిన అవసరం రాదు. ఈ సీజన్​లో పెద్దవాళ్లు, చిన్నపిల్లల ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉండడం చాలా ముఖ్యం. 

రీ–ఇన్ఫెక్షన్ ఛాన్స్

ఏదైనా ఇన్ఫెక్షన్​ వచ్చి, తగ్గిన తర్వాత ఆటోమెటిక్​గా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ ఎన్ని రోజులు ఉంటుందనే దానిపైనే ఏ ఇన్ఫెక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. కరోనా మిగతా వేరియెంట్ల యాంటీబాడీలు 30 –40 రోజులు యాక్టివ్​గా ఉంటాయి. అయితే, ఒమిక్రాన్​ విషయంలో ఇమ్యూనిటీ ఎన్ని రోజులు ఉంటుందనేది తెలియదు. కరోనా రీ–ఇన్ఫెక్షన్​ కేసుల్లో చాలావరకు డెల్టా, ఒమి క్రాన్​ వేరియెంట్లు... రెండింటి వల్ల వస్తున్నాయి. డెల్టాప్లస్​ ఇన్ఫెక్షన్​ కూడా మళ్లీ వస్తోంది. ఇప్పటివర కైతే ఒమిక్రాన్​ రీ–ఇన్ఫెక్షన్​ కేసులు రిజిష్టర్​ కాలేదు. 

లక్షణాల్ని బట్టి..

కొవిడ్​, ఫ్లూ, ఇతర వైరల్​ ఫీవర్​... లక్షణాలు ఒకేలా అనిపిస్తాయి. అయితే, జాగ్రత్తగా గమనిస్తే లక్షణాల తీవ్రత అన్నింటిలో ఒకేలా ఉండదు. ఈ మూడింటిని సింప్టమ్స్​ని బట్టి అంచనా వేయొచ్చు. ఒకవేళ కోవిడ్ అనిపిస్తే మాత్రం వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. 

పొడి దగ్గు: కొవిడ్ ఇన్ఫెక్షన్​, ఫ్లూలో ఎక్కువ. జలుబులో అప్పుడప్పుడు.

జ్వరం: కొవిడ్​ ఇన్ఫెక్షన్​, ఫ్లూ వచ్చినప్పుడు జ్వరం వస్తుంది. 

ముక్కు పట్టేయడం:  కొవిడ్​లో తక్కువ. ఫ్లూలో చాలా ఎక్కువ.  

గొంతునొప్పి: కొవిడ్​, ఫ్లూలో కొన్నిసార్లు, జలుబు ఉన్నప్పుడు  ఎక్కువ. 

శ్వాసలో ఇబ్బంది: కొవిడ్​ సోకిన కొందరిలో, ఫ్లూలో ఈ లక్షణం కనిపించదు.

తలనొప్పి: కొవిడ్​ ఇన్ఫెక్షన్​లో అప్పుడప్పుడు, ఫ్లూలో అయితే చాలాసార్లు ఉండదు. 

ఒళ్లు నొప్పులు: కొవిడ్​లో అప్పుడప్పుడు, అదే ఫ్లూలో మాత్రం చాలాసార్లు. 

డయేరియా: కొవిడ్​లో చాలా అరుదుగా. ఫ్లూలో అప్పుడప్పుడు.

అలసట: కొవిడ్​లో అప్పుడప్పుడు. ఫ్లూలో ఎక్కువ. 

తుమ్ములు: కొవిడ్, ఫ్లూలో కనిపించవు.

తప్పనిసరి జాగ్రత్తలు

  • డెల్టాప్లస్​ కంటే ఒమిక్రాన్​ వైరస్​ చాలా వేగంగా వ్యాపిస్తోంది. బయటకు వెళ్లినప్పుడు మాస్క్​, శానిటైజర్​ తప్పనిసరి. 
  • క్లాత్​ మాస్క్​తో ప్రొటెక్షన్​ తక్కువ. క్లాత్​మాస్కులు చాలా చిన్నగా ఉండి కరోనా వేరియెంట్లని అడ్డుకోలేవు. అందుకే సర్జికల్​ మాస్క్​ పెట్టుకోవాలి.
  • కరోనా టెస్టులు చేసేవాళ్లు, పేషెంట్లకి ట్రీట్మెంట్​ చేసే సిస్టర్లు, డాక్టర్లు ఎన్​95 మాస్క్​ వాడాలి.
  • జనం గుంపులుగా ఉండే ప్లేస్​లకి వెళ్లొద్దు. ప్రొటీన్లు, విటమిన్లు అందే ఫుడ్​ తినాలి. ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం ఆకుకూరలు, పండ్లు, నట్స్​ ఎక్కువ తినాలి. 

– డా​.జి.నవోదయ, 

కన్సల్టెంట్​ జనరల్​ మెడిసిన్, 

కేర్​ హాస్పిటల్స్, హైదరాబాద్​.