గ్రేటర్‌లో పెరిగిపోతున్న వీధి కుక్కల బెడద

గ్రేటర్‌లో పెరిగిపోతున్న వీధి కుక్కల బెడద

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకూ వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. అయితే దాదాపు 4 లక్షల 61 వేల కుక్కలు ఉన్నాయి. వాటిలో  75 శాతం కుక్కలు అంటే 3 లక్షల20 వేల కుక్కలకు స్టేరిలైజేషన్ పూర్తి చేశామని బల్దియా వెటర్నరీ ఆఫీసర్లు చెబుతున్నారు. బల్దియాతో పాటు 5 ప్రైవేట్ ఏజన్సీలతో ఒక్కో కుక్కకు రూ.1500 ఖర్చు చేస్తోన్నట్టు అధికారులు అంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5 యానిమల్ కేర్ సెంటర్లు ఉన్నాయని జీహెచ్ఎంసీ వెటర్నరీ ఆఫీసర్ జీవ్యా నాయక్ తెలిపారు. ప్రతి రోజూ 200 కుక్కలకు ఆపరేషన్ చేయిస్తున్నామని వెల్లడించారు. కంప్లయింట్ వచ్చిన చోటకు వెళ్లి కుక్కను తీసుకు వచ్చి ఆపరేషన్ చేస్తున్నం చేస్తున్నామని మరో వెటర్నరీ ఆఫీసర్ యాదగిరి చెప్పారు. కుక్కల కోసం ఎల్బీ నగర్ లో ఏర్పాటు చేసిన యానిమల్ కేర్ సెంటర్ చాలా అద్భుతంగా ఉందని, అలాంటిది దేశంలోనే ఎక్కడా లేదని బల్దియా ఆఫీసర్ స్పష్టం చేశారు.

కుక్కలకు ఆపరేషన్ చేసిన తర్వాత వాటి  చెవికి ఒక మరక పెడతామని, ఆపరేషన్ పూర్తయ్యాక కుక్కలో ముందు ఉన్న ఆ కోపం, ఆవేశం ఉండవని -వెటర్నరీ అధికారులు చెబుతున్నారు. ఎండాకాలం లో చాలా కుక్కలకు చిరాకుతో దాడి చేసే అవకాశం ఉంటుందంటున్నారు. చాలా వరకు కుక్కలను మనుషులు ఏమీ అననంత వరకు అవి మనకు ఎలాంటి హానీ చేయవని చెబుతున్నారు. ప్రతి యానిమల్ కేర్ సెంటర్ కు తీసుకొచ్చిన మరుసటి రోజు వాటికి అపరేషన్ చేసి ఐదు రోజుల వరకు అబ్జర్వేషన్ లో ఉంచుతామంటున్నారు. యానిమల్ కేర్ సెంటర్లో ప్రత్యేకంగా కుక్కల రక్షణ కోసం ఐసీయూ కూడా అందుబాటులో ఉంచామని, 24 గంటల పాటు వాటిని సంరక్షిస్తున్నామని వెటర్నరీ డాక్టర్స్ వెల్లడించారు.