కరోనా సోకినప్పుడు నాకూ ఇవే ట్యాబ్లెట్లు రాశారు

కరోనా సోకినప్పుడు నాకూ ఇవే ట్యాబ్లెట్లు రాశారు

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీలు తమ మందులనే పేషెంట్లకు రాయాలంటూ డాక్టర్లకు భారీ ఎత్తున తాయిలాలు ఇస్తున్నాయని సుప్రీంకోర్టుకు ‘మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్ సంఘాల ఫెడరేషన్ (ఎఫ్ఎంఆర్ఏఐ)’ వెల్లడించింది. తాయిలాలకు ఆశపడి డాక్టర్లు ఒకే మందును ఎక్కువగా రాయడం వల్ల.. ప్రజలకు ఓవర్ డోస్ తో ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉందని, ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపింది. ఉదాహరణకు.. జ్వరం తగ్గేందుకు వినియోగించే డోలో 650 ట్యాబ్లెట్లను తయారు చేస్తున్న బెంగళూర్ కు చెందిన మైక్రోల్యాబ్స్ అనే కంపెనీ డాక్టర్లకు ఏకంగా రూ. 1000 కోట్ల మేరకు ఇన్ సెంటివ్ లను ఇచ్చినట్లు వివరించింది.

ఫార్మా కోడ్ ను పటిష్టం చేసి, డాక్టర్లకు తాయిలాలు ఇచ్చే కంపెనీలపై చర్యలు తీసుకునేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఎఫ్ఎంఆర్ఏఐ గతంలో దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. ఫెడరేషన్ తరఫున అడ్వకేట్ సంజయ్ పారిఖ్ వాదిస్తూ.. 9 రాష్ట్రాల్లోని మైక్రోల్యాబ్స్ ఆఫీసులపై ఇంతకుముందు దాడులు చేసిన సీబీడీటీ రూ. 300 కోట్ల మేరకు ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు గుర్తించిందని, ఇందులో దొరికిన డేటా ప్రకారం.. డాక్టర్లకు రూ. వెయ్యి కోట్ల ఫ్రీ గిఫ్ట్ లు ఇచ్చినట్లు తేలిందన్నారు. కరోనాపుడు  రెమ్ డెసివిర్ మందును డాక్టర్లు అత్యధికంగా ప్రిస్క్రిప్షన్ చేయడం, సేల్స్ విపరీతంగా పెరగడం కూడా ఈ దందాకు మరో ఎగ్జాంపుల్ అని తెలిపారు.  

నాకూ ఇవే ట్యాబ్లెట్లు రాశారు: డీవై చంద్రచూడ్ 

జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ.. ఇది చాలా సీరియస్ విషయమన్నారు. ‘‘కరోనా సోకినప్పుడు నాకు కూడా ఇవే ట్యాబ్లెట్లు రాశారు. ఇది చాలా సీరియస్ మ్యాటర్” అని అభిప్రాయపడ్డారు. అయితే, ‘యూనిఫామ్ కోడ్ ఆఫ్ ​ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్’ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాలని, జవాబుదారీతనం ఉండేలా రూల్స్ పెట్టాలని ఎఫ్ఎంఆర్ఏఐ దాఖలు చేసిన ఈ పిటిషన్​పై ఇప్పటికే కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. కేంద్రం నుంచి ఇంకా స్పందన రాలేదు. గురువారం విచారణలో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ కేఎం నటరాజ్ వాదిస్తూ.. కేంద్రం అఫిడవిట్ దాదాపుగా రెడీ అయిందన్నారు. దీంతో 10 రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని కేంద్రానికి సుప్రీం మరోసారి నోటీసులు ఇచ్చింది.